Pawan Kalyan: అభిమానుల మృతి... పరిహారం ప్రకటించిన పవన్ కల్యాణ్
- రాజమహేంద్రవరంలో 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్
- ఈ వేడుకలో పాల్గొని తిరిగి ఇంటికి వెళుతున్న క్రమంలో రోడ్డు ప్రమాదం
- ఈ దుర్ఘటనలో ఆరవ మణికంఠ, తోకాడ చరణ్ మృత్యువాత
- ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పవన్
- మృతుల కుటుంబాలకు చెరో రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటన
'గేమ్ ఛేంజర్' ఈవెంట్‌కు హాజరై తిరిగి వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఇద్దరు అభిమానుల కుటుంబాలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిహారం ప్రకటించారు. జనసేన తరఫున రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఈ ఘటనపై ఆయనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రమాదం జరిగిన కాకినాడ-రాజమండ్రి రోడ్డును గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. పాడైపోయిన రోడ్డును కొంతకాలంగా బాగు చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొని తిరిగి ఇళ్లకు వెళుతున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ, తోకాడ చరణ్ ప్రమాదవశాత్తు మృతిచెందడం బాధించిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు జనసేనాని ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఇళ్లకు సురక్షితంగా వెళ్లాలని ఈవెంట్‌లో ఒకటికి రెండుసార్లు తాను చెప్పినట్లు పవన్ గుర్తు చేశారు. ఈ ప్రమాదం తనను ఎంతో బాధించిందన్నారు. జనసేన తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన డిప్యూటీ సీఎం... ప్రభుత్వం తరఫున కూడా తగిన సహాయం అందించే ఏర్పాట్లు చేయాలని తన కార్యాలయ అధికారులను ఆదేశించారు. అలాగే ఇక నుంచి పిఠాపురం నియోజకవర్గ పర్యటనలకు ఏడీబీ రోడ్డు మీదుగానే రాకపోకలు సాగించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.