AP Paper Mill: జీతాలు పెంచాలని కార్మికుల ఆందోళన... ఏపీ పేపర్ మిల్ లాకౌట్

Andhra Paper Limited declares lockout of Rajamahendravaram unit due to workers protest

  • యాజమాన్యం తీరుపై ఆందోళన చేపట్టిన కార్మికులు
  • రాజమండ్రిలోని పేపర్ మిల్ వద్ద ఉద్రిక్తత
  • పెద్ద సంఖ్యలో కంపెనీ వద్దకు చేరుకున్న కార్మికులు

ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో ఇంటర్నేషనల్ ఏపీ పేపర్ మిల్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జీతాలు పెంచాలంటూ ఐదు రోజులుగా కార్మికులు నిరసన చేస్తుండడంతో కంపెనీ యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. ఏళ్ల తరబడి జీతాలు పెంచకపోవడంతో నిరసన చేపట్టామని, ఐదు రోజుల నుంచి నిరసన చేస్తుంటే యాజమాన్యం తాజాగా కంపెనీ లాకౌట్ ప్రకటించిందని కార్మికులు మండిపడుతున్నారు. ఆకస్మికంగా లాకౌట్ ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

కార్మికుల ఆందోళన విషయం తెలిసి పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో కంపెనీ వద్దకు చేరుకున్నారు. ఆందోళన విరమించాలని కార్మికులకు సూచించారు. అయితే, కార్మికులు మాత్రం వెనక్కి తగ్గడంలేదు. వెంటనే లాకౌట్ ఎత్తివేసి, తమ జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

రాజమండ్రిలో 1898లో ప్రారంభమైన ఈ పేపర్ మిల్లు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. చాలాకాలంగా కార్మికుల జీతాలు పెంచలేదు. జీతాల పెంపుపై పలుమార్లు విజ్ఞప్తి చేసినా యాజమాన్యం పట్టించుకోలేదన్నారు. యాజమాన్య ప్రతినిధులతో చర్చలు జరిపినా ఉపయోగం లేకుండా పోయిందని ఆరోపించారు. దీంతో నిరసన ప్రదర్శనలు చేపట్టామని కార్మికులు తెలిపారు. ఈసారి కచ్చితంగా జీతాలు పెంచాల్సిందేనని పట్టుబట్టడంతో యాజమాన్యం మిల్లుకు లాకౌట్ ప్రకటించిందని మండిపడుతున్నారు.

  • Loading...

More Telugu News