Trudeau: రాజీనామా యోచనలో కెనడా ప్రధాని ట్రూడో.. నేడో, రేపో ప్రకటన

Canadian PM Justin Trudeau To Resign Before Key Meet This Week

  • లిబరల్ పార్టీలో ట్రూడోపై తీవ్ర వ్యతిరేకత
  • ఈ నెల 8న లిబరల్ పార్టీ కాకస్ మీటింగ్
  • ఆలోపే రాజీనామా ప్రకటించనున్న ట్రూడో

కెనడా ప్రధాని, లిబరల్ పార్టీ అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో రాజీనామా చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. పార్టీలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత నెలకొనడం, వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదన్న అంచనాల నేపథ్యంలో ట్రూడో రాజీనామా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ నెల 8న లిబరల్ పార్టీ కాకస్ మీటింగ్ జరగనుంది. ఈలోపే పార్టీ పదవికి ట్రూడో రాజీనామా చేస్తారని, లేదంటే పార్టీ మీటింగ్ లో నేతలే ఆయనకు ఉద్వాసన పలికే పరిస్థితి ఉందని సమాచారం.

పార్టీ మీటింగ్ లో అవమానకరరీతిలో తొలగింపబడడం కన్నా ముందే తప్పుకోవడం గౌరవంగా ఉంటుందనే భావనతో ట్రూడో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టే విషయంపై కెనడా ఆర్థిక మంత్రి డొమినిక్ లెబ్లాంక్ తో ట్రూడో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈమేరకు కెనడా మీడియా ఆదివారం కథనాలు ప్రచురించాయి.

ట్రూడో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ప్రధానిగా కొనసాగుతారా? లేక రెండింటికీ రాజీనామా చేస్తారా? అనే విషయంపై స్పష్టత లేదు. లిబరల్ పార్టీ అధ్యక్షుడిగా ట్రూడో పదేళ్లకు పైగా కొనసాగుతున్నారు. మరోవైపు, వచ్చే అక్టోబర్ లోగా కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితిలో ట్రూడో రాజీనామా చేస్తే లిబరల్ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం ఉండదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

ఎన్నికల రేసులో కన్జర్వేటివ్ పార్టీ ముందంజలో ఉందని, లిబరల్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. తాత్కాలిక అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళితే పార్టీకి మరింత మైనస్ కానుందనే అభిప్రాయాలు లిబరల్ పార్టీలోనే వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News