Formula-E Care Race: ‘ఫార్ములా-ఈ’ కేసులో నేడు విచారణకు కేటీఆర్
- ఫార్ములా-ఈ కారు రేసులో కేటీఆర్‌పై ఆరోపణలు
- ఈ ఉదయం 10 గంటలకు హాజరు కానున్న కేటీఆర్
- రేపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ ఎదుట హాజరు
- సహ నిందితులుగా బీఎల్ఎన్ రెడ్డి, అరవింద్‌కుమార్
ఫార్ములా-ఈ కారు రేసుకు సంబంధించిన కేసులో బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను నేడు ఏసీబీ విచారించనుంది. ఉదయం పది గంటలకు ఆయన అధికారుల ఎదుట హాజరుకానున్నారు. కాగా, తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించగా పిటిషన్‌పై తీర్పును కోర్టు రిజర్వు చేసింది. అయితే, తీర్పు ప్రకటించే వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దని, కాకపోతే విచారణను మాత్రం కొనసాగించవచ్చని తెలిపింది.
ఈ నేపథ్యంలో 6న ఉదయం 10 గంటలకు విచారణకు రావాల్సిందిగా కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఇదే కేసులో రేపు (7న) తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేటీఆర్‌కు సమన్లు జారీచేసింది. ఇదే కేసులో సహ నిందితులైన బీఎల్ఎన్ రెడ్డి, అరవింద్‌కుమార్‌లను ఈ నెల 2,3 తేదీల్లోనే విచారించాల్సి ఉండగా, తమకు కొంత సమయం కావాలని కోరడంతో వారికి ఈడీ వారం రోజుల సమయం ఇచ్చింది.