Revanth Reddy: తెలంగాణ సీఎం కిరణ్ కుమార్ అంటూ పలికిన టాలీవుడ్ నటుడు... వీడియో వైరల్!
- ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభ వేదికపై సీఎం రేవంత్ రెడ్డికి అవమానం
- ముఖ్య అతిధి రేవంత్ రెడ్డిని వేదికపైకి ఆహ్వానించే క్రమంలో టాలీవుడ్ నటుడు బాలాదిత్య టంగ్ స్లిప్
- పొరబాటున ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ అనడంతో కేకలు వేసిన సభికులు
హైదరాబాద్ హైటెక్స్‌లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి అవమానం జరిగింది. ముఖ్య అతిథి, అతిధులను వేదికపైకి ఆహ్వానిస్తున్న సినీ నటుడు బాలాదిత్య టంగ్ స్లిప్ అయ్యారు. మన ప్రియతమ నాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి అనాల్సింది బదులు ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ అంటూ టంగ్ స్లిప్ అయ్యారు. దీంతో సభకు హజరైన వారందరూ ఒక్కసారిగా కేకలు వేయడంతో హోస్ట్‌గా వ్యవహరించిన సినీ నటుడు బాలాదిత్య తన ఉచ్ఛారణలో జరిగిన తప్పిదాన్ని (టంగ్ స్లిప్) తెలుసుకున్నారు.
అనంతరం కొద్దిసేపటి లోనే క్షమాపణలు చెప్పిన బాలాదిత్య.. ముఖ్యఅతిథి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఆహ్వానించారు. అయితే తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో తెలంగాణలో మరో యాంకర్ జైలుకు వెళ్లబోతున్నాడని పలువురు నెటిజన్లు ఆసక్తికరంగా కామెంట్స్ చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండు బ్రో అంటూ హోస్ట్‌గా వ్యవహరించిన బాలాదిత్యకు సలహాలు ఇస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పటికే పుష్ప 2 ఈవెంట్‌లో అల్లు అర్జున్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును మర్చిపోవడం వల్లనే ఆయన్ను సంధ్య థియేటర్ కేసులో జైలుకు పంపారని సోషల్ మీడియాలో టాక్ నడిచిన విషయం తెలిసిందే.