weight loss: పైనాపిల్, అల్లం కలిపి వాడితే.. ఇలా బరువు తగ్గుతారా?
- మారిన జీవన శైలితో బరువు పెరిగిపోతున్నవారు ఎందరో...
- అధిక బరువు, స్థూలకాయం కారణంగా ఆరోగ్య సమస్యలు
- బరువు తగ్గేందుకు ఎన్నెన్నో తంటాలు పడుతున్న తీరు
- పైనాపిల్, అల్లం కలిపి ఇలా వినియోగిస్తే ప్రయోజనం ఉంటుందంటున్న నిపుణులు
వ్యాయామం లేకపోవడం, ఫ్యాటీ ఫుడ్, జంక్ ఫుడ్ తినడం వల్ల ఇటీవలి కాలంలో చాలా మంది తెలియకుండానే బరువు పెరిగిపోతున్నారు. దానితో ఎన్నో అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. తిరిగి బరువు తగ్గేందుకు తంటాలు పడుతున్నారు. అలాంటి వారు పైనాపిల్, అల్లం కలిపి వినియోగిస్తే ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రెండింటిలోని కొన్ని రకాల పదార్థాలు సహజంగా బరువు తగ్గేందుకు తోడ్పడుతాయని వివరిస్తున్నారు. తగిన మోతాదులో జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు.
జీవ క్రియల వేగం పెరుగుతుంది...
పైనాపిల్, అల్లం రెండింటిలో బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయని, అవి శరీరంలో జీవక్రియలను (మెటబాలిజం) ఉత్తేజితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అల్లంలోని జింజరాల్, పైనాపిల్లోని విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు కలిసి శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించి... శక్తిని పెంచుతాయని వివరిస్తున్నారు. శరీరంలో మెటబాలిజం పెరగడం వల్ల... ఎక్కువ శక్తి ఖర్చయి, బరువు తగ్గేందుకు దోహదపడుతుందని స్పష్టం చేస్తున్నారు.
ఆకలి నియంత్రణలోకి వస్తుంది...
మనలో ఆకలిని నియంత్రించేందుకు అల్లంలోని పదార్థాలు ఎంతగానో ఉపయోగపడతాయని, కడుపు నిండుగా ఉన్న భావన కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో పైనాపిల్ లోని సహజమైన చక్కెర... మనకు తీపి పదార్థాలు తీసుకోవాలన్న కోరికను నియంత్రిస్తుందని వివరిస్తున్నారు. అందువల్ల రెండూ కలిపి తింటే బరువు తగ్గాలనుకునే వారికి మంచి ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు.
కొవ్వులను కరిగిస్తుంది...
పైనాపిల్ లోని బ్రొమెలీన్ మన శరీరంలో కొవ్వులు బ్రేక్ డౌన్ అయ్యేందుకు దోహదపడుతుంది. అల్లంలోని పదార్థాలు దీనిని మరింత సమర్థవంతంగా పనిచేసేలా ఉత్తేజితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణ వ్యవస్థ మెరుగుపడి..
చాలా మందిలో జీర్ణ వ్యవస్థలో సమస్యల కారణంగా కూడా బరువు తగ్గే ప్రయత్నాలు ఫలించవని నిపుణులు చెబుతున్నారు. పైనాపిల్ లోని బ్రొమెలీన్, అల్లంలోని పదార్థాలు జీర్ణ శక్తిని అద్భుతంగా మెరుగుపరుస్తాయని వివరిస్తున్నారు. కడుపు ఉబ్బరం నుంచి గ్యాస్ దాకా ఎన్నో సమస్యలు తగ్గుతాయని... ఆహారంలోని పోషకాలు శరీరానికి సరిగా అంది మెటబాలిజం మెరుగుపడుతుందని స్పష్టం చేస్తున్నారు.
ఇన్ ఫ్లమేషన్ కు దూరం...
పైనాపిల్, అల్లం రెండూ కూడా అద్భుతమైన యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నవే. పైనాపిల్ లోని బ్రొమెలీన్, అల్లంలోని జింజరాల్ రెండూ కూడా మనలో బరువు పెరిగేందుకు కారణమయ్యే ఇన్ ఫ్లమేషన్ లక్షణాలను నియంత్రిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఇమ్యూనిటీ పెరిగి... విషపదార్థాలు పోయి...
అల్లం, పైనాపిల్ రెండింటిలోని పలు పదార్థాలు మన శరీరంలో నుంచి విష పదార్థాలు బయటికి వెళ్లేందుకు దోహదపడతాయని... రోగ నిరోధక శక్తి పెరిగేందుకు తోడ్పడుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ అంశాలు గుర్తుంచుకోవాలి
అల్లం, పైనాపిల్ రెండూ కూడా సహజమైన ఆహార పదార్థాలే, శరీరానికి మంచి చేసేవే అయినా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కొన్నిరకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో వీటి ప్రభావం వేరుగా ఉండే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. అందువల్ల ఆహారంలో మార్పులు చేసుకునే ముందు వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.