Vangalapudi Anitha: ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం వాటిల్లితే నా పిల్లలనైనా పక్కన పెడతా: హోం మంత్రి అనిత

Home Minister Anitha Said Why She Removed Her PA

  • తన ప్రైవేటు పీఏ జగదీశ్ తొలగింపుపై స్పందించిన అనిత
  • హెచ్చరించిన తర్వాత కూడా ఆరోపణలు రావడంతో పది రోజుల క్రితమే తప్పించినట్టు వెల్లడి
  • విశాఖ జైలులో సెల్‌ఫోన్ల గుట్టు తేలుస్తామన్న హోంమంత్రి
  • గంజాయి కేసు నిందితులను రాజమహేంద్రవరం జైలుకు తరలిస్తామని వెల్లడి 

తన ప్రైవేటు పీఏ జగదీశ్‌ను తొలగించడంపై ఏపీ హోంమంత్రి అనిత స్పందించారు. ప్రభుత్వానికి కానీ, తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠకు కానీ భంగం కలుగుతుందని భావిస్తే తన పిల్లలనైనా పక్కనపెడతానని పేర్కొన్నారు. విశాఖపట్నం సెంట్రల్ జైలులోని పెన్నా బ్లాక్‌ సమీపంలో సెల్‌ఫోన్లు దొరకడం, ఖైదీలకు జైలు సిబ్బంది గంజాయి సరఫరా చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో నిన్న ఉదయం ఆమె ఆకస్మికంగా జైలును పరిశీలించారు. వివిధ విభాగాలను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా అనిత విలేకరులతో మాట్లాడుతూ జగదీశ్ అనే వ్యక్తి తన ప్రైవేటు పీఏ అని, తన సొంత డబ్బుతో జీతం ఇచ్చానని తెలిపారు. అయితే, ఇటీవల అతడిపై ఆరోపణలు రావడంతో హెచ్చరించానని, అయినా, ఫిర్యాదులు ఆగకపోవడంతో పది రోజుల క్రితమే ఉద్యోగం నుంచి తొలగించానని వివరించారు.

జైలులో తనిఖీలపై మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో జైలులో సెక్యూరిటీ, నిర్వహణ, ఉద్యోగుల బదిలీలను గాలికి వదిలేశారని విమర్శించారు. రాష్ట్రంలోని జైళ్లు, పోలీస్ స్టేషన్లలో కొందరు అవినీతి అధికారులు, సిబ్బంది ఐదేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్నట్టు చెప్పారు. జైలులోని నర్మద బ్లాక్‌ సమీపంలో చిన్న గంజాయి మొక్క కనిపించిందని, ఇకపై జైలులో ఏం జరిగినా తెలిసేలా అన్ని చోట్లా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డీజీపీని హోం మంత్రి ఆదేశించారు. ఇక, జైలులో సెల్‌ఫోన్లు దొరకడంపై మాట్లాడుతూ అందులో ఏ నంబర్ ఉపయోగించారు? ఎవరితో మాట్లాడారన్న విషయాన్ని తేలుస్తామన్నారు. గంజాయి కేసులో ఉన్న వారిని రాజమహేంద్రవరం జైలుకు తరలిస్తామని అనిత పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News