Revanth Reddy: జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర సన్నగిల్లుతోంది: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy attends World Telugu Federation meeting

  • హైదరాబాదులో ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు
  • హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
  • ఏ రంగంలో ఎంత ఎత్తుకు ఎదిగినా సొంత భాషను మర్చిపోరాదని సూచన

హైదరాబాదులో జరుగుతున్న ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. దేశంలో హిందీ తర్వాత అత్యధికులు మాట్లాడే భాష తెలుగు అని పేర్కొన్నారు. తెలుగుభాష ఉనికిని, మనుగడను, మన సంప్రదాయాన్ని కోల్పోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర సన్నగిల్లుతోందని, ఈ విషయంలో అందరూ ఆలోచించాలని అన్నారు. 

"గతంలో దేశ రాజకీయాల్లో ఎందరో తెలుగువారు క్రియాశీలకంగా వ్యవహరించారు. నీలం సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్, కాకా వెంకటస్వామి, జైపాల్ రెడ్డి, వెంకయ్యనాయుడు వంటి నేతలు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. రాజకీయం, సినీ, వాణిజ్య రంగాల్లో రాణించినప్పటికీ మన భాషను మర్చిపోరాదు. పరభాషా జ్ఞానం సంపాదిస్తే మంచిదే... కానీ సొంత భాషను గౌరవించాలి. 

తెలుగు భాషను గౌరవించే క్రమంలో, ఇటీవల రైతు రుణమాఫీ జీవోను తెలుగులోనే ఇచ్చాం. అలాగే, న్యాయస్థానాల్లో తీర్పుల ప్రతులు తెలుగులో ఉంటే ఎంతోమందికి ఉపయుక్తంగా ఉంటుంది" అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 

"తెలంగాణ, ఏపీ... రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడేలా ముందుకు వెళ్లాలి. తెలంగాణ రైజింగ్ నినాదంతో, అభివృద్ధి ప్రణాళికలతో తెలంగాణలో ముందుకు వెళుతున్నాం. ప్రపంచంలో అత్యున్నత నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు తెలంగాణలో పెట్టుబడులు పెట్టి, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి. పెట్టుబడులతో వచ్చేవారికి సింగిల్ విండో అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది" అని వివరించారు.

  • Loading...

More Telugu News