Virat Kohli: కోహ్లీని సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందన్న టీమిండియా మాజీ ఆటగాడు
- బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఓటమి
- దారుణంగా విఫలమైన కోహ్లీ
- టీమిండియాకు సూపర్ స్టార్ సంస్కృతి అవసరంలేదన్న ఇర్ఫాన్ పఠాన్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా సీనియర్ బ్యాట్స్ మన్లు దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఈ సిరీస్ ఒక చేదు అనుభవంలా మిగిలిపోతుంది. కోహ్లీ విషయానికొస్తే... ఈ ఐదు టెస్టుల సిరీస్ లో 9 ఇన్నింగ్స్ లు ఆడిన కోహ్లీ 190 పరుగులు మాత్రమే చేశాడు. పెర్త్ లో జరిగిన తొలి టెస్టులో సెంచరీ చేసిన కోహ్లీ... ఆ తర్వాత వరుసగా విఫలమయ్యాడు. జట్టుకు అవసరమైన సమయంలో కోహ్లీ చేతులెత్తేశాడు.
ఈ నేపథ్యంలో, టీమిండియా మాజీ ఆటగాడు, క్రికెట్ వ్యాఖ్యాత ఇర్ఫాన్ పఠాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాకు సూపర్ స్టార్ సంస్కృతి అవసరం లేదని అన్నాడు. కోహ్లీ స్థానంలో కొత్త ఆటగాళ్లను తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నాడు.
"గత ఐదేళ్లుగా టెస్టుల్లో కోహ్లీ బ్యాటింగ్ యావరేజి 30 కూడా లేదు. కోహ్లీ స్థానంలో ఒక కొత్త ఆటగాడికి అవకాశాలు ఇస్తే అతడు కూడా 25 నుంచి 30 సగటు నమోదు చేస్తాడు. సచిన్ వంటి దిగ్గజ క్రికెటర్ కూడా దేశవాళీ క్రికెట్ ఆడాడు. కానీ కోహ్లీ దేశవాళీ క్రికెట్ ఆడి పదేళ్లయింది. జాతీయ జట్టుకు మ్యాచ్ లు లేని ఖాళీ సమయాల్లో అయినా కోహ్లీ దేశవాళీ క్రికెట్ ఆడొచ్చు కదా!" అని ఇర్ఫాన్ పఠాన్ ప్రశ్నించాడు.