Storm of The Decade: అమెరికాపై పంజా విసరనున్న 'ఈ దశాబ్దంలోనే అతి తీవ్ర మంచు తుపాను'
- భారీ మంచు తుపాను ముంగిట అమెరికా
- వారం రోజుల పాటు తుపాను కొనసాగుతుందన్న వాతావరణ సంస్థలు
- దాదాపు 6 కోట్ల మందిపై ప్రభావం
- అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
అమెరికాపై భారీ మంచు తుపాను పంజా విసరనుందని వాతావరణ సంస్థలు అంచనా వేశాయి. ఇది ఈ దశాబ్దంలోనే అతి తీవ్ర మంచు తుపాను అని, దీని ప్రభావం 15 రాష్ట్రాలపై ఉంటుందని భావిస్తున్నారు. దాదాపు 6 కోట్ల మంది ప్రజలు ఈ ప్రమాదకర మంచు తుపాను బారినపడే అవకాశాలున్నట్టు అంచనా. దీని తీవ్రత వారం రోజుల పాటు ఉండొచ్చని ప్రైవేటు వాతావరణ సంస్థ ఆక్యువెదర్ వెల్లడించింది. 2011 తర్వాత అమెరికాలో ఇంతటి శీతల వాతావరణం ఏర్పడడం మళ్లీ ఇదే ప్రథమం అని పేర్కొంది.
వాతావరణ సంస్థల హెచ్చరికలతో అమెరికాలోని పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. కాన్సాస్, ఆర్కాన్సాస్, కెంటకీ, వర్జీనియా రాష్ట్రాల్లో ఇప్పటికే అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మిసిసిపి, ఫ్లోరిడా, ఫిలడెల్ఫియా మేరీల్యాండ్, వాషింగ్టన్, బాల్టిమోర్ ప్రభుత్వాలు కూడా మంచు తుపానుపై అప్రమత్తత ప్రకటించాయి.
25 సెంటిమీటర్ల మేర మంచు కురిసే అవకాశం ఉండడంతో రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతుందని వాతావరణ సంస్థలు తెలిపాయి. భారీ స్థాయిలో మంచు, వర్షం, అత్యంత కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతాయని వివరించాయి.
ఈ మంచు తుపాను మధ్య అమెరికాలో మొదలవుతుందని, తూర్పు దిశగా పయనిస్తుందని అమెరికా జాతీయ వాతావరణ సంస్థ (ఎన్ డబ్ల్యూఎస్) వెల్లడించింది. మిస్సోరీ నుంచి సెంట్రల్ అట్లాంటిక్ వరకు విస్తరించి అత్యంత తీవ్ర మంచు తుపానుగా మారుతుందని పేర్కొంది.