Nara Lokesh: విశాఖలో ప్రధాని పర్యటన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించిన నారా లోకేశ్

Nara Lokesh reviews arrangements for PM Modi Visakha visit on Jan 8

  • ఈ నెల 8న రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీ
  • విశాఖలో పర్యటన
  • ఎన్నికల తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్న ప్రధాని
  • ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం
  • విశాఖ కలెక్టర్టేట్ లో సమీక్ష నిర్వహించిన మంత్రి నారా లోకేశ్

ఏపీలో కూటమి విజయం సాధించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారు. ఈ నెల 8న మోదీ విశాఖలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో, ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖ మంత్రి నారా లోకేశ్ నేడు విశాఖకు వెళ్లారు. మోదీ పర్యటన ఏర్పాట్లను లోకేశ్ స్వయంగా పర్యవేక్షించారు. ఆయన వెంట మంత్రులు అచ్చెన్నాయుడు, డోలా బాలవీరాంజనేయస్వామి, కొండపల్లి శ్రీనివాస్, పార్టీ సీనియర్ నేత కళా వెంకట్రావు కూడా ఉన్నారు.

ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లకు సంబంధించి విశాఖ కలెక్టరేట్ లో ఉన్నతాధికారులు, కూటమి ప్రజాప్రతినిధులతో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలోని మంత్రుల బృందం సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రధాని పర్యటనకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు మంత్రుల బృందం దిశానిర్దేశం చేసింది. ఈ సమీక్షా సమావేశంలో ఉత్తరాంధ్ర జిల్లాల కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మిషన్ మోడ్ తో పనిచేసి ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలి

అందరూ కలిసికట్టుగా మిషన్ మోడ్ తో పనిచేసి జనవరి 8న విశాఖలో జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారిగా ప్రధాని ఏపీ వస్తున్నారని, ఇదొక చరిత్రాత్మక పర్యటన అని పేర్కొన్నారు. అందరూ సింగిల్ ఏజెండాతో పనిచేయాలని, గతంలో ఎన్నడూ జరగని విధంగా ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ఇందుకు అధికారులు, కూటమి నేతలు బాధ్యతలు తీసుకోవాలని పేర్కొన్నారు. 

ప్రధాని పర్యటన రాష్ట్రానికి ఎంతో కీలకం

ప్రధానమంత్రి పర్యటన రాష్ట్రానికి ఎంతో కీలకం అని, రాష్ట్ర భవిష్యత్ ఈ పర్యటనపై ఆధారపడి ఉందని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మోదీ ఎంతో మద్దతుగా నిలుస్తున్నారని, ఏ రాష్ట్రానికి కేటాయించని ప్రాజెక్టులను, నిధులను ఏపీకి కేటాయించారని తెలిపారు. రాష్ట్రాన్ని ఫాస్ట్ ట్రాక్ లో పెట్టేందుకు కేంద్ర మద్దతు చాలా అవసరమని తెలిపారు. 

"అభివృద్ధి వికేంద్రీకరణ ఎన్డీయే నినాదం. ఇదేదో కేవలం ఉత్తరాంధ్రకు సంబంధించిన పర్యటన కాదు.. మొత్తం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ కు సంబంధించినది. మనం కూడా సింగిల్ ఎజెండాతో బూత్ స్థాయిలో మానిటరింగ్ చేసి ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలి. అందుకు తగ్గట్లుగా ప్రధాని రోడ్ షో, బహిరంగ సభకు ఘనంగా ఏర్పాట్లు చేయాలి" అని దిశానిర్దేశం చేశారు. 

గతంలో విజయవాడలో జరిగిన ప్రధాని రోడ్ షో కంటే మిన్నగా జరగాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికీ విజయవాడ రోడ్ షో, చిలకలూరిపేటలో జరిగిన బహిరంగ సభల గురించి ప్రధాని ప్రస్తావిస్తుంటారని ఈ సందర్భంగా లోకేశ్ గుర్తుచేశారు. 

సింగిల్ బారికేడ్లు ఏర్పాటు చేయాలి

ప్రధానమంత్రి రోడ్ షో కు సంబంధించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సింగిల్ బారికేడ్లు ఏర్పాటు చేయాలని మంత్రుల బృందం పోలీసు ఉన్నతాధికారులకు సూచించింది. ఎంతమంది తరలివచ్చినా ఎలాంటి ఆంక్షలు విధించకుండా అందరినీ అనుమతించాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రులు పలు సూచనలు చేశారు. 

రోడ్ షో ను విభాగాల వారీగా విభజించి ప్రజాప్రతినిధులకు, అధికారులకు బాధ్యతలు అప్పగించారు. రోడ్ షో, బహిరంగ సభలకు సంబంధించి పర్యవేక్షణ బాధ్యతలను మూడు పార్టీల నుంచి ఒక్కొక్క ప్రజాప్రతినిధి చొప్పన సమన్వయ బాధ్యతలు అప్పగించారు. 

బహిరంగ సభకు 3 లక్షల మంది హాజరు

ప్రధానమంత్రి బహిరంగ సభకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూర్పుగోదావరి జిల్లా నుంచి సుమారు 3 లక్షల మంది వరకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇందుకు తగ్గట్లుగా వసతులు, భోజన సదుపాయం కల్పించాలని మంత్రుల బృందం ఆదేశించింది. జనసమీకరణ, పార్కింగ్, పాస్ ల పంపిణీపైనా సమావేశంలో చర్చించారు. ద్విచక్ర వాహనాలపై వచ్చేవారికీ పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. 

ప్రధాని బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించిన మంత్రుల బృందం

జనవరి 8వ తేదీన ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనే బహిరంగ సభ స్థలాన్ని మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలోని మంత్రుల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ ప్రాంగణం మొత్తం కలియతిరిగి అధికారులకు పలు సూచనలు చేశారు. 

  • Loading...

More Telugu News