Uganda: 12 మంది భార్యలు.. 102 మంది సంతానంతో ఏకంగా ఊరునే సృష్టించాడు
- మనవలు మనవరాళ్లతో కలిపి మొత్తం 795 మంది కుటుంబ సభ్యులు
- రికార్డులకెక్కిన ఉగాండాలో వందలాది ఎకరాల ఆసామి
- గంపెడు సంతానం కారణంగా కూలీలుగా మారిన వైనం
ఉగాండాలో ఓ వ్యక్తి ఏకంగా తన కుటుంబ సభ్యులతో చిన్న గ్రామాన్నే సృష్టించాడు. పన్నెండు మందిని పెళ్లి చేసుకుని తనకున్న వందలాది ఎకరాల్లో తలో ఇల్లు నిర్మించి ఇచ్చాడు. భార్యల ద్వారా కలిగిన సంతానం పెరిగి పెద్దయ్యాక మిగతా స్థలంలో ఇల్లు కట్టుకున్నారు. దీంతో వందలాది ఎకరాల సాగు భూమి కాస్తా చిన్నపాటి గ్రామంగా మారిపోయింది. ఉగాండాలోని ఆ ఊరిపేరు ముకిజా.. ఆ ఊరు సృష్టికర్త పేరు మూసా హసహ్యా కసేరా. ప్రస్తుతం కసేరా వయసు 67 ఏళ్లు.
ఆయనకు 12 మంది భార్యలు, వారి ద్వారా 102 మంది సంతానం. ఆ సంతానం ద్వారా 578 మంది మనవలు, మనవరాళ్లు. వీరందరినీ పోషించేందుకు, నివాసం ఉండడానికి కసేరాకు ఉన్న వ్యవసాయ భూమి కాస్తా కరిగిపోయింది. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యుల సంఖ్య 795 కు చేరింది. కసేరా సంతానంలో అందరికన్నా చిన్న మనవడికి ఇప్పుడు ఐదేళ్లు. వందలాదిగా ఉన్న మనవలు, మనవరాళ్ల పేర్లు గుర్తుంచుకోలేక కసేరా ఓ రిజిస్టర్ మెయింటెయిన్ చేస్తున్నాడట. కసేరా కుటుంబ సభ్యులు ప్రస్తుతం చుట్టుపక్కల గ్రామాల్లో కూలీ పనులకు వెళుతున్నారు.