crops experiment: అంతరిక్షంలో విత్తనాలు మొలకెత్తాయి!
- అంతరిక్షంలో అంకురోత్పత్తి
- నాలుగు రోజుల్లో అలసంద మొలకెత్తిందన్న ఇస్రో
- త్వరలో ఆకులు కూడా వస్తాయని వెల్లడి
అంతరిక్షంలో అలసంద మొలకెత్తింది. ఇది ఇస్రో సాధించిన మరో ఘనతగా పేర్కొనవచ్చు. స్పేడెక్స్‌లో ప్రయోగం చేపట్టిన తర్వాత అవి నాలుగు రోజుల్లో అవి మొలకెత్తినట్లు ఇస్రో ప్రకటించింది.
కంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ (క్రాప్స్) పేరుతో పీఎస్ఎల్వీ – సీ 60 రాకెట్ లో ఇస్రో ఓ పేలోడ్‌ను అంతరిక్షంలోకి పంపింది. అందులో 8 అలసంద విత్తనాలు పంపగా, నాలుగు రోజుల్లో అవి మొలకెత్తినట్లు తాజాగా ఇస్రో వెల్లడించింది. అంతరిక్షంలో జీవం మొలకెత్తిందని, త్వరలో ఆకులు కూడా వస్తాయని ఎక్స్ ద్వారా ఇస్రో వెల్లడించింది. ఈ పేలోడ్‌ను ఇస్రోకు చెందిన విక్రమ్ సారాబాయ్ అంతరిక్ష కేంద్రం అభివద్ధి చేసింది.
అంతరిక్షంలో విత్తనం మొలకెత్తే విధానంతో పాటు రోదసిలోని వ్యర్థాలను ఒడిసిపట్టే రోబోటిక్ హ్యాండ్, హరిత చోదన వ్యవస్థ లాంటి వినూత్న ఉపకరణాలను కూడా ఇస్రో అంతరిక్షంలోకి పంపింది. సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో పాలకూర పెరుగుదలను కూడా పరీక్షించనున్నారు. మొక్కలు గురుత్వాకర్షణ, కాంతి దిశను పసిగడుతున్న తీరు గురించి కొత్త అంశాలను ఈ ప్రయోగం వెలుగులోకి తెస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.