Pushpa 2: పుష్ప-2 విడుదలై శనివారంతో నెల.. మొత్తం కలెక్షన్లు ఎంతంటే?
- విడుదలైన 31వ రోజైన శనివారం హిందీ వెర్షన్‌లో రూ.4.35 కోట్లు రాబట్టిన పుష్పరాజ్
- నెల రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.1,200 కోట్లు కొల్లగొట్టిన పుష్ప-2
- ప్రపంచ వ్యాప్తంగా రూ.1,800 కోట్లు దాటిన సినిమా వసూళ్లు
అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో, దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప-2 మూవీ డిసెంబర్ 5న విడుదలైంది. జనవరి 4తో ఈ సినిమా విడుదలై నెల రోజులు పూర్తయ్యాయి. అయినప్పటికీ ఈ మూవీ కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా హిందీ వెర్షన్ వసూళ్లు చెప్పుకోదగ్గ రీతిలోనే రాబడుతోంది.
విడుదలైన 31వ రోజైన శనివారం ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ.5.5 కోట్లు వసూలు చేసింది. తెలుగు వెర్షన్‌లో రూ.1 కోటి, హిందీ వెర్షన్‌లో రూ. 4.35 కోట్లు, తమిళం, కన్నడ వెర్షన్లలో కలిపి రూ.15 లక్షలు కొల్లగొట్టింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్లు రూ.1,200 కోట్ల మైలురాయికి చేరువయ్యాయి. శనివారం నాటికి రూ.1,199 కోట్లకు చేరుకున్నాయని మూవీ కలెక్షన్లను ట్రాక్ చేసే ‘శాక్‌నిల్క్’ పేర్కొంది.
ఇవాళ (జనవరి 5) ఆదివారం కావడం, థియేటర్లలో ఇతర చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ లేకపోవడంతో పుష్ప-2 వసూళ్లు గణనీయంగా పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయని బాక్సాఫీస్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక, ప్రపంచవ్యాప్తంగా పుష్ప-2 సినిమా కలెక్షన్లు రూ.1,800 కోట్లు దాటాయి. సంక్రాంతికి కొత్త సినిమాలు వస్తుండడంతో పుష్ప-2 వసూళ్లపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.