Bala Subramanyam: నిరుపయోగంగా నెల్లూరులోని బాలు నివాసం
- నెల్లూరు తిప్పరాజువారి వీధిలో ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం నివాసం
- ఆ ఇంటిని 2020లో వేద పాఠశాల నిర్వహణ కోసం కంచిపీఠానికి అప్పగింత
- కానీ, ఐదేళ్లు పూర్తికావస్తున్నా ఇప్పటికీ నివాసం నిరుపయోగంగానే ఉన్న వైనం
ప్రముఖ గాయకుడు స్వర్గీయ ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం నెల్లూరు తిప్పరాజువారి వీధిలోని తాను నివాసం ఉన్న ఇంటిని వేద పాఠశాల నిర్వహణ కోసం 2020 ఫిబ్రవరి 11న కంచిపీఠానికి అప్పగించారు. కంచి పీఠం కోరిక మేరకు రూ. 10లక్షలు పెట్టి అవసరమైన వసతులు కూడా కల్పించారు. కానీ, ఐదేళ్లు పూర్తికావస్తున్నా ఇప్పటికీ ఈ నివాసం నిరుపయోగంగానే ఉంది.
ఉన్నతాశయంతో బాలు రూ.1కోటికి పైగా విలువ చేసే ఇంటిని అందించినా వినియోగంలోకి తీసుకురావడంలో కంచి పీఠం విఫలమైందని పలువురు విమర్శిస్తున్నారు. కంచి పీఠాధిపతి నెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఇక్కడ 'వేద-నాద' ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. కానీ, ఐదేళ్లు పూర్తయిన కూడా ఆ మాట ఇంకా చేతల్లోకి రాలేదు. దాంతో బాలు ఫ్యామిలీ నివసించిన ఆ ఇంట్లో నేడు కనీసం దీపం వెలిగించే వారే కరవయ్యారని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ఈ విషయంపై నెల్లూరు కంచి మఠం మేనేజర్ నందకిశోర్ స్పందించారు. బాలు నివాసంలో తొలుత 10 మంది విద్యార్థులతో వేద పాఠశాలను ప్రారంభించినట్లు తెలిపారు. అయితే, వసతులు సక్రమంగా లేకపోవడంతో నిర్వహించలేకపోయామన్నారు. మిద్దెపైన రేకుల షెడ్డులో పిల్లలు ఉండటం ఇబ్బందిగా మారిందని, దాంతో విద్యార్థులను వేరే పాఠశాలకు పంపించినట్లు ఆయన పేర్కొన్నారు. అందుకే ప్రస్తుతం అక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదన్నారు. అయితే, ఆ నివాసాన్ని ఎలా వినియోగంలోకి తీసుకురావాలనే ఆలోచన జరుగుతుందని నందకిశోర్ చెప్పుకొచ్చారు.