Pawan Kalyan: రండి... ఏపీలో స్టూడియోలు నిర్మించండి... మేం అండగా ఉంటాం: పవన్ కల్యాణ్

Pawan Kalyan invites Telugu film makers to Andhra
 
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలుగు ఫిలిం మేకర్స్ కు ఆహ్వానం పలికారు. ఏపీలో ఉన్న లొకేషన్లను సద్వినియోగపరుచుకోవాలని, ఏపీలో యువతకు ఉపాధి కల్పించాలని పిలుపునిచ్చారు. రాజమండ్రిలో నిర్వహించిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... ఏపీలో యువతకు ఉపాధి కల్పించేందుకు తెలుగు సినీ పెద్దలు ఆలోచించాలని అన్నారు. 

మీరు (దిల్ రాజు) తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ కదా... మీరు ఆంధ్రప్రదేశ్ ను చిన్నచూపు చూడకండి (నవ్వుతూ) అని పేర్కొన్నారు. ఇదొక్కటే నేను కోరుకుంటాను అని చెప్పారు. అందుకు దిల్ రాజు బదులిస్తూ... రెండు కళ్లులా చూసుకుంటాం సార్ అని చెప్పగా... రెండు కళ్లు ఇవన్నీ నేను నమ్మను కానీ... తెలంగాణ, ఏపీలో తెలుగు చిత్ర పరిశ్రమ అద్భుతంగా ఉండాలని ఆకాంక్షిస్తానని తెలిపారు. 

"మా కుర్రాళ్లు బైక్ ల మీద విన్యాసాలు చేస్తుంటారు... బైకులేసుకుని తిరుగుతూ గోల చేస్తుంటారు... మా వాళ్ల కోసం ఓ స్టంట్ స్కూల్ పెట్టండి. గోదావరి జిల్లాల్లోనో, రాయలసీమలోనో, కడపలోనో... ఎక్కడో రెండు మూడు స్టంట్ స్కూల్స్ పెట్టండి. మా వాళ్లకు స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ ఇవ్వండి. స్క్రీన్ ప్లే గురించి రాజమౌళిని వచ్చి చెప్పమనండి... త్రివిక్రమ్ గారిని వచ్చి క్లాసులు తీసుకోమని చెప్పండి. కీరవాణి గారు, తమన్ గారు వంటి వాళ్లను వచ్చి మా వాళ్లకు నైపుణ్య శిక్షణ ఇవ్వమనండి. 

మీరు దీని గురించి ఆలోచించండి... ఏపీలో మీరు స్టూడియో పెట్టండి. సినీ దర్శకులు ఎలా కావాలో చెప్పండి... 24 క్రాఫ్ట్స్ లో ఒకటైన ప్రొడక్షన్ డిజైనింగ్ నేర్పించండి మావాళ్లకు. ఫిలిం మేకింగ్ స్కూల్స్ పెట్టండి. ఇవాళ మీకోసం ఎంతమంది వచ్చారో చూడండి. మీకోసం టికెట్ రేట్లు పెంచాం... ముఖ్యమంత్రి చంద్రబాబుగారు మీకు అండగా ఉన్నారు... మేమంతా మీకు అండగా ఉన్నాం. 

తెలుగు చిత్ర పరిశ్రమను మీ ద్వారా మేం కోరుకునేది... ఇంత మంది తెలుగు యువత ఉన్నారు... వారికి ఉపాధి కల్పించండి. మాకు ముమ్మిడివరం వంటి గొప్ప లొకేషన్లు ఉన్నాయి... ముమ్మిడివరం కేరళను మించిపోయి ఉంటుంది... గోదావరి తీరం చూడండి... అసలు మీరు కడపలో గండికోటను చూడండి... సిద్ధవటం చూడండి... అడ్వెంచర్ సినిమాలకు వీలుగా ఉంటాయి. 

అటువైపు పార్వతీపురం వెళ్లండి... మన్యం ప్రాంతం అద్భుతంగా ఉంటుంది. ఏపీలో ఉన్న లొకేషన్లను అందరికీ చూపించండి... మీకు సౌకర్యాలు కల్పిస్తాం. మా మంత్రి దుర్గేశ్ గారికి కూడా చెబుతున్నాను. ఈ సందర్భంగా... తెలుగు చిత్ర పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేస్తున్నాను. మరొక్కమారు మనందరికీ ఇష్టమైన రామ్ చరణ్ కు హృదయపూర్వకంగా శుభాకాంక్షలుతెలియజేస్తున్నాను" అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 
Pawan Kalyan
Tollywood
Andhra Pradesh
Chandrababu
TDP-JanaSena-BJP Alliance

More Telugu News