Pawan Kalyan: రామ్ చరణ్... మా బంగారం: పవన్ కల్యాణ్
రాజమండ్రిలో ఏర్పాటు చేసిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్... హీరో రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. రామ్ చరణ్ తనకెంతో ఇష్టమైన వ్యక్తి అని పేర్కొన్నారు.
"రామ్ చరణ్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తి. రామ్ చరణ్ అందరు హీరోల పట్ల ఎంతో గౌరవం చూపిస్తాడు. మా నాన్న ఏం తలుచుకుని పేరు పెట్టాడో కానీ, ఆ పేరును సార్థకం చేసుకుంటున్నాడు.... కొన్ని రోజులు అయ్యప్పమాల వేసుకుంటాడు, మరికొన్ని రోజులు ఆంజనేయస్వామి మాల వేసుకుంటాడు. ఎందుకురా ఇలా మాలలు వేస్తుంటావు అని అడుగుతుంటాను. నా బాధ్యతల నుంచి తప్పుకోకుండా ఉండడానికి, నన్ను నేను నియంత్రించుకోవడానికి, అహంకారం రాకుండా ఉండడానికి మాల వేసుకుంటాను అని చెబుతుంటాడు.
సంవత్సరంలో కనీసం వంద రోజులైనా మాల ధరించి ఉంటాడు. కాళ్లకు చెప్పులు కూడా వేసుకోడు. నేనే చెప్పులు లేకుండా తిరగాలంటే ఇబ్బందిపడతాను. కానీ రామ్ చరణ్ మామూలు హీరో కాదు... తను ఆస్కార్ వరకు వెళ్లాడు... అమెరికాలో కూడా చెప్పుల్లేకుండానే ఉంటాడు. అందుకెంతో ధైర్యం ఉండాలి.
అవసరమైతే సూటు బూటు వేసుకోగలడు, లేకపోతే అయ్యప్ప మాలలోనైనా కనిపిస్తాడు. వ్యక్తిత్వంలో ఎంతో బలం ఉంటేనే ఇలాంటివి సాధ్యం. అలాంటి రామ్ చరణ్ పదహారణాల తెలుగువాడు... మా బంగారం! మేం ఒక తల్లికి పుట్టకపోయినా నా తమ్ముడు. ఎంతో వినయవిధేయతలు ఉన్న వ్యక్తి. అతడికి అద్భుత విజయాలు కలగాలని ఒక బాబాయిగా, ఒక అన్నగా ఆశీర్వదిస్తున్నా. ఐ లవ్యూ రామ్ చరణ్... ఐ లవ్యూ ఆల్" అని పేర్కొన్నారు.