Allu Arjun: నాంపల్లి కోర్టుకు వచ్చి పూచీకత్తు పత్రాలు సమర్పించిన అల్లు అర్జున్
- సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో నిన్న బెయిల్
- మామ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి వచ్చిన అల్లు అర్జున్
- పూచీకత్తు పత్రాలను న్యాయమూర్తికి సమర్పించిన నటుడు
సినీ నటుడు అల్లు అర్జున్ ఈరోజు మధ్యాహ్నం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. నాంపల్లి కోర్టులో బెయిల్ పూచీకత్తు పత్రాలను న్యాయమూర్తికి సమర్పించారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా తన ఇంటికి వెళ్లారు. తన మామ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ఆయన నాంపల్లి కోర్టుకు వచ్చారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ఏ11గా ఉన్నారు.
గత నెలలో పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కొడుకు తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్‌లోని కిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసుకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు.
ఆ తర్వాత హైకోర్టు ఆయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నిన్న నాంపల్లి కోర్టు షరతులతో కూడిన పూర్తిస్థాయి బెయిల్ ఇచ్చింది. రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయవద్దని, కేసును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయవద్దని షరతులు విధించింది. రెండు నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఈ క్రమంలో ఈరోజు నాంపల్లి కోర్టుకు వచ్చిన అల్లు అర్జున్ పూచీకత్తు పత్రాలు సమర్పించారు.