Balakrishna: సంక్రాంతి బరిలో బాలయ్య భారీ హిట్లు కొట్టిన సినిమాలివే!
- 1999 సంక్రాంతికి వచ్చిన 'సమరసింహారెడ్డి'
- 2001 సంక్రాంతికి సందడి చేసిన 'నరసింహనాయుడు'
- 2017లో సంక్రాతి బరిలో దిగిన 'గౌతమీపుత్ర శాతకర్ణి'
- 2023లో ఘన విజయాన్ని అందుకున్న 'వీరసింహారెడ్డి'
- ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్న 'డాకు మహారాజ్'
బాలకృష్ణకి మొదటి నుంచి కూడా సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. సాధ్యమైనంత వరకూ తన సినిమా సంక్రాంతి బరిలో ఉండేలా ఆయన ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అలా సంక్రాంతి బరిలో నిలిచిన సమయాలలో ఎక్కువసార్లు ఆయనను విజయాలు వరించాయి. అంతేకాదు వసూళ్ల విషయంలో ఆ సినిమాలు కొత్త రికార్డులను నమోదు చేసి, ఆయన కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలుగా నిలిచాయి. అందువలన సంక్రాంతికి ఆయన సినిమా రావడమే అసలైన పండుగ అన్నట్టుగా అభిమానులు ఉంటారు.
సంక్రాంతి బరిలోకి భారీ విజయాన్ని అందుకున్న బాలయ్య సినిమాగా 'సమరసింహారెడ్డి' కనిపిస్తుంది. 1999 జనవరి 13వ తేదీన విడుదలైన ఈ సినిమా, సంచలన విజయాన్ని నమోదు చేసింది. బి. గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మణిశర్మ మ్యూజికల్ హిట్ గా నిలబెట్టాడు. ఆ తరువాత వచ్చిన 'నరసింహానాయుడు' కూడా దాదాపు అదే స్థాయిలో బాక్సాఫీస్ ను ఊపేసింది. 2001 జనవరి 11న విడుదలైన ఈ సినిమాకి కూడా మణిశర్మనే సంగీత దర్శకుడు. పాటల పరంగా ఈ సినిమా కూడా హుషారెత్తించింది.
ఇక బాలకృష్ణ కెరియర్లో మైలురాయి 'గౌతమీపుత్ర శాతకర్ణి'. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలకృష్ణకి ఇది 100వ సినిమా. ఆయన సంక్రాంతి విజయాలలో 100 సినిమా కూడా నిలవడం మరో విశేషం. 2023లో జనవరి 12న వచ్చిన 'వీరసింహారెడ్డి' కూడా సంక్రాంతి సంచలనంగా నిలిచింది. మైత్రీ బ్యానర్ పై గోపీచంద్ మలినేని తెరకెక్కించిన సినిమా ఇది. ఇక ఈ ఏడాది 'డాకు మహారాజ్' గా బాలయ్య బరిలోకి దిగారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా, బాలయ్య బాబు సంక్రాంతి సెంటిమెంటును నిలబడుతుందనేది అభిమానుల అభిప్రాయం.