Game Changer: 'గేమ్ ఛేంజర్'కు నిరసన సెగ.. బ్యాన్ చేయాలంటూ ఆందోళన..!
- కర్ణాటకలో 'గేమ్ ఛేంజర్'కు నిరసన సెగ
- పోస్టర్లపై కన్నడ భాషలో కాకుండా ఇంగ్లీష్‌లో మూవీ టైటిల్ ఉండడమే ఇందుకు కారణం
- 'గేమ్ ఛేంజర్' పోస్టర్లపై స్ప్రే చేస్తూ నిరసన తెలిపిన కన్నడిగులు
- సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి 'బ్యాన్ గేమ్ ఛేంజర్ ఇన్ కర్ణాటక' హ్యాష్ ట్యాగ్
దక్షిణాది డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న భారీ చిత్రం 'గేమ్ ఛేంజర్'. సంక్రాంతి కానుకగా ఈ నెల 10న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. మరోసారి చెర్రీ తన నటనతో మెస్మరైజ్ చేయడం ఖాయం అని అభిమానులు చెబుతున్నారు.
ఈ క్రమంలో కర్ణాటకలో ఈ సినిమాకు నిరసన సెగ తగిలింది. అక్కడి వారు కొందరు 'గేమ్ ఛేంజర్' పోస్టర్లపై స్ప్రే చేయడం షాక్‌కి గురిచేసింది. దీనికి కారణం ఈ మూవీ టైటిల్ కన్నడ భాషలో కాకుండా ఆంగ్లంలో ఉండడంతో అక్కడి వారు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే 'బ్యాన్ గేమ్ ఛేంజర్ ఇన్ కర్ణాటక' హ్యాష్ ట్యాగ్ సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌లో నిలిచింది.
సినిమా టైటిల్ ఇంగ్లీష్‌లో ఉండటం పట్ల కన్నడిగులు సీరియస్ అవుతున్నారు. వెంటనే కన్నడ భాషలోకి టైటిల్‌ను మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. ఇక కర్ణాటకలో తమ భాషపై అక్కడి ప్రజలు అమితాభిమానం చూపిస్తారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇటీవల అక్కడి షాపింగ్ మాల్స్, హోటళ్లపై దాడులు జరిగాయి. ఇంగ్లీష్‌లో మాల్స్, హోటళ్ల పేర్లను తప్పుబడుతూ వారు దాడులకు దిగారు.
ఈ క్రమంలోనే ఇప్పుడు 'గేమ్ ఛేంజర్', 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రాలకు ఈ నిరసన సెగ తగిలింది. ఈ సినిమాల పోస్టర్లపై ఆంగ్లం, తెలుగులో ఉన్న టైటిల్స్‌ను చూసిన అక్కడి వారు స్ప్రేలు చేసి ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీని తాలూకు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.