Karun Nair: ఐపీఎల్ 2025కు ముందు చరిత్ర సృష్టించిన కరుణ్ నాయర్
- విజయ్ హజారే ట్రోఫీలో మరో సెంచరీ నమోదు
- ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా ఔట్ కాకుండా పరుగుల వరద
- ఇప్పటివరకు మొత్తం 542 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన కరుణ్ నాయర్
ఒకప్పుడు మంచి హిట్టర్‌గా పేరు తెచ్చుకొని ఐపీఎల్‌లో అదరగొట్టిన కరుణ్ నాయర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ వ్యాప్తంగా లిస్ట్-ఏ క్రికెట్ సీజన్‌లో ఒక్కసారి కూడా ఔట్ కాకుండా అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా చరిత్ర నెలకొల్పాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో జరిగిన గ్రూప్-డీ మ్యాచ్‌లో విదర్భ తరపున ఆడిన కరుణ్ నాయర్ ఉత్తరప్రదేశ్‌పై 112 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు.
దీంతో, ప్రస్తుత విజయ్ హజారే ట్రోఫీలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా ఔట్ కాకుండా మొత్తం 542 పరుగులు సాధించాడు. ప్రపంచవ్యాప్తంగా లిస్ట్-ఏ క్రికెట్‌లో ఔట్ కాకుండా ఒక బ్యాటర్ సాధించిన అత్యధిక పరుగులు ఇవే కావడం విశేషం.
2010లో న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ సాధించిన 527 పరుగుల రికార్డును కరుణ్ నాయర్ బద్దలుకొట్టాడు. ఈ జాబితాలో జాషువా వాన్ హీర్డెన్ (512), ఫఖర్ జమాన్ (455), తౌఫీక్ ఉమర్ (422) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
కాగా, విజయనగరం వేదికగా జరిగిన గ్రూప్-డీ మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్‌పై విదర్భ ఘనవిజయం సాధించింది. శుక్రవారం ముగిసిన ఈ మ్యాచ్‌లో కరుణ్ నాయర్ రాణించడంతో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ నాయర్‌కు ఇది నాలుగవ సెంచరీ.