Social Media: సోషల్ మీడియా వినియోగంపై కొత్త చట్టం తీసుకువస్తున్న కేంద్రం!

parental consent must for childrens accounts centre in draft social media rules

  • పిల్లల సోషల్ మీడియా అకౌంట్స్‌కి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి
  • డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ 2025 డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం
  • ఫిబ్రవరి 18వరకు ప్రజల నుంచి సూచనలు, అభ్యంతరాల స్వీకరణ

ప్రస్తుత సాంకేతిక యుగంలో స్మార్ట్ ఫోన్ వాడకం ప్రజల్లో ఒక భాగమైంది. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ ప్రయాణాలు, లావాదేవీలు, షాపింగ్‌లో ఏది కొనుగోలు చేయాలన్నా, కాలక్షేపం కోసం పిల్లల నుంచి పెద్దల వరకూ సెల్ ఫోన్ వాడుతూనే ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో చిన్నారులు గంటల కొద్దీ సోషల్ మీడియాలో గడుపుతున్నారని, దీని వల్ల వారిపై విపరీతమైన ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంతే కాకుండా వారి డేటా ఉల్లంఘనలపైనా ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి. 

ఈ క్రమంలో చిన్నారులను ఇంటర్నెట్‌కు, అందులోనూ ముఖ్యంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంచేందుకు ఇటీవల కొన్ని దేశాలు చర్యలు చేపట్టాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలకు సన్నద్ధం అయింది. ఈ చర్యల్లో భాగంగా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ 2025 కు సంబంధించి ప్రతిపాదిత ముసాయిదా నిబంధనలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఇందులో ప్రధానంగా 18 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయడానికి తల్లిదండ్రుల సమ్మతిని తప్పనిసరి చేసింది. ప్రజలు దీనిపై సూచనలు, అభ్యంతరాలు పంపాలని తెలిపింది. Mygov.in  వెబ్ సైట్‌లో తమ అభ్యంతరాలు, సూచనలు పంపవచ్చు. ఫిబ్రవరి 18 తర్వాత వీటిని కేంద్రం పరిశీలించనుంది. వచ్చిన అభ్యంతరాల ఆధారంగా ముసాయిదాలో మార్పులు చేర్పులు చేసి చట్టాన్ని తీసుకురానుంది.
 
మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం చిన్నారులు సోషల్ మీడియా ఖాతాలను తెరవాలంటే తల్లిదండ్రులు లేదా సంరక్షకుల అనుమతి తప్పనిసరి. అది కచ్చితంగా ధ్రువీకృతమైందిగా ఉండాలని నిబంధనల్లో పేర్కొన్నారు. సమాచార రక్షణకు సంబంధించి, పిల్లల వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేసేందుకు కచ్చితంగా తల్లిదండ్రుల నుంచి అంగీకారం పొందాలని నిబంధనల్లో ఉంది. దీని వల్ల సోషల్ మీడియాలను నిర్వహించే సంస్థలు చిన్నారుల వ్యక్తిగత డేటాను వాడుకోవాలన్నా, భద్రపరుచుకోవాలనుకున్నా తల్లిదండ్రుల సమ్మతి పొందిన తర్వాతనే సాధ్యమవుతుంది.  

ఈ ముసాయిదాలో వినియోగదారుడికి అనుకూలంగా పలు కీలక అంశాలను తీసుకువచ్చింది. డేటా సంరక్షణపై వినియోగదారులకు పూర్తి నియంత్రణ ఉండేలా నిబంధనలు రూపొందించారు. వ్యక్తిగత సమాచారానికి సంబంధించి కంపెనీలు మరింత పారదర్శకంగా ఉండాలి. తమ వ్యక్తిగత సమాచారాన్ని కంపెనీలు ఎందుకు సేకరిస్తున్నాయి? అని అడిగేందుకు అవకాశాన్ని కల్పించారు. సేకరించిన తమ సమాచారాన్ని తొలగించమని వినియోగదారులు డిమాండ్ చేయవచ్చు. ఒకవేళ డేటా ఉల్లంఘనకు పాల్పడితే సదరు కంపెనీలపై రూ.250 కోట్ల వరకూ జరిమానా విధించే ప్రతిపాదనను పొందుపరిచారు.     

  • Loading...

More Telugu News