Vangalapudi Anitha: అవినీతి ఆరోపణలు.. ఏపీ హోం మంత్రి అనిత పీఏ జగదీశ్‌ తొలగింపు

Home Minsiter Anitha PA Jagadish Sacked

  • పదేళ్లుగా అనిత వద్ద పీఏగా చేస్తున్న జగదీశ్
  • అనిత హోంమంత్రి అయ్యాక పెచ్చుమీరిన అక్రమాలు
  • ప్రతి పనికీ వసూళ్లు, అక్రమాల్లో వాటాల ఆరోపణలు
  • జగదీశ్ తొలగింపుతో బాధితుల సంబరాలు

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రైవేటు పీఏ జగదీశ్‌పై వేటు పడింది. బదిలీలు, పోస్టింగులు, సిఫార్సులు వంటి వాటి కోసం వసూళ్లకు పాల్పడుతున్నారని, సెటిల్‌మెంట్లు చేస్తున్నారన్న ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్నారు. జగదీశ్ పదేళ్లుగా అనిత వద్ద పీఏగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, అనిత హోంమంత్రి అవడంతో ఆయన అవినీతి పెచ్చుమీరిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

అంతేకాదు, ఎంత పెద్ద నాయకుడినైనా ఆయన పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. మంత్రి తర్వాత అన్నీ తానే అన్నట్టుగా చక్కబెడుతున్నట్టు తెలిసింది. మద్యం దుకాణాల్లో వాటాల కోసం లైసెన్స్ దారులపై ఒత్తిడి, హోంమంత్రికి సంబంధించిన తిరుమల దర్శనం సిఫార్సు లేఖలను తిరుపతిలోని ఓ హోటల్‌కు గంపగుత్తగా అమ్ముకోవడం వంటి ఆరోపణలు కూడా జగదీశ్‌పై ఉన్నాయి. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు అనిత ఆయనను తొలగించారు. విషయం తెలిసిన పాయకరావుపేట నియోజకవర్గంలోని టీడీపీ క్యాడర్, జగదీశ్ బాధితులు సంబరాలు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News