Puneet Khurana: భార్య వేధింపులు భరించలేక కేఫ్ యజమాని ఆత్మహత్య
- బెంగళూరు టెకీ అతుల్ సుభాష్‌లానే ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో
- విడాకుల కోసం కోర్టు ముందే సంతకాలు చేసినా ఇంకా రూ. 10 లక్షల కోసం చిత్రహింసలు పెడుతున్నారని ఆరోపణ
- అంత డబ్బులు ఇవ్వడం తన శక్తికి మించిన పని అని ఆవేదన
- ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్న పునీత్ ఖురానా
భార్య వేధింపులు తట్టుకోలేక ఇటీవల బెంగళూరులో అతుల్ సుభాష్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటనను మర్చిపోకముందే, అటువంటి ఘటనే ఢిల్లీలో జరిగింది. భార్య మానిక పహ్వా నుంచి విడాకులు తీసుకుంటున్నట్టు కోర్టు ముందు సంతకాలు చేసినా విడిచిపెట్టడం లేదని, గొంతెమ్మ కోరికలతో నిత్యం తనకు నరకం చూపించారంటూ కేఫ్ యజమాని పునీత్ ఖురానా (40) ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు.
అంతకుముందు పునీత్ అత్తింటి వారు పెడుతున్న బాధలను చెబుతూ, తన మొబైల్ ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసుకున్నారు. విడాకులకు ఆమోదం తెలుపుతూ కోర్టు ముందు ఇద్దరం సంబంధిత పత్రాలపై సంతకాలు చేశామని, కోర్టు ఇచ్చిన 180 రోజుల గడువులో 90 రోజులు పూర్తయ్యాయని పేర్కొన్నాడు. అయితే, ఇంకా వారు తన శక్తికి మించి డిమాండ్లు చేస్తున్నారని, చిత్ర హింసలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మరో రూ. 10 లక్షలు అడిగారని, అంత సొమ్ము ఇవ్వడం తన వల్ల కాదని ఆ వీడియోలో పునీత్ పేర్కొన్నారు.
పునీత్ ఆత్మహత్యకు మానిక పహ్వా, ఆమె సోదరి, తల్లిదండ్రులే కారణమని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డబ్బుల కోసమే కాకుండా ఎమోషనల్ గానూ టార్చర్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అతడి సోషల్ మీడియా ఖాతాను హ్యాక్ చేసి వివిధ మార్గాల ద్వారా వేధించారని తెలిపారు. 59 నిమిషాల నిడివి ఉన్న వీడియోను రికార్డు చేసిన పునీత్ తాను ఎదుర్కొన్న చిత్రహింసల గురించి అందులో పూసగుచ్చినట్టు వివరించాడని పేర్కొన్నారు. భార్య, అత్తింటి వారు పెట్టే వేధింపులను తన కుమారుడు మౌనంగానే భరించాడని, తన కష్టాల గురించి ఎప్పుడూ తమకు చెప్పలేదని పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.