Bashar al Assad: రష్యాలో ఆశ్రయం పొందుతున్న సిరియా మాజీ అధ్యక్షుడు బషర్‌పై విష ప్రయోగం!
- డిసెంబర్ 8 నుంచి రష్యాలో ఆశ్రయం పొందుతున్న బషర్ అల్ అసద్
- డిసెంబర్ 29న అనారోగ్యం బారినపడిన మాజీ అధ్యక్షుడు
- వైద్య పరీక్షల్లో విష పదార్థాల ఆనవాళ్లు
- బషర్‌పై హత్యా ప్రయత్నం జరిగిందని నమ్మడానికి కారణాలు ఉన్నాయన్న రష్యా నిఘా విభాగపు మాజీ అధికారి
రష్యాలో ఆశ్రయం పొందుతున్న సిరియా మాజీ అధ్యక్షుడు బషర్-అల్-అసద్‌పై విష ప్రయోగం జరిగినట్టు తెలిసింది. డిసెంబర్ 29న అసద్ అనారోగ్యం బారినపడినట్టు వార్తలు వచ్చాయి. తీవ్రమైన దగ్గుతోపాటు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. తలనొప్పి, కడుపు నొప్పి కూడా వేధించాయి. ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే చికిత్స అందించారు. పరీక్షల్లో విషపదార్థాల ఆనవాళ్లు కనిపించాయని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
విష ప్రయోగంపై దర్యాప్తు జరుగుతున్నట్టు రష్యా నిఘా విభాగపు మాజీ అధికారి ఒకరు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. బషర్‌పై హత్యా ప్రయత్నం జరిగిందని నమ్మడానికి కారణాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే, రష్యా మాత్రం అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు.
తిరుగుబాటు దళాలు ఇటీవల సిరియా రాజధాని డమాస్కస్‌ను ఆక్రమించుకోవడంతో బషర్-అల్-అసద్ దేశాన్ని వదిలి వెళ్లిపోయారు. ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని రెబల్స్ కూల్చివేసినట్టు కూడా వార్తలు వచ్చినా అందులో నిజం లేదని తేలింది. రష్యా చేరుకున్న బషర్ డిసెంబర్ 8 నుంచి అక్కడే ఆశ్రయం పొందుతున్నారు.