K Kavitha: రైతు భరోసాకు దరఖాస్తులు ఇవ్వాలా?: ప్రభుత్వంపై కవిత ఆగ్రహం

Kavitha fires at Revanth Reddy government over Rythu Bharosa

  • షరతులు, నిబంధనల పేరుతో అన్నదాతకు సున్నం పెట్టే ప్రయత్నమని మండిపాటు
  • ఎలాంటి నిబంధనలు లేకుండా రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్
  • కేసీఆర్ రైతాంగాన్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నారన్న కవిత

రైతు భరోసా పథకానికి కూడా దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించడం దారుణమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. రైతు భరోసాకు నిబంధనలు పెట్టవద్దని ఆమె డిమాండ్ చేశారు. గురువారం తన నివాసంలో జరిగిన బోధన్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ... రైతు భరోసా పథకానికి షరతులు, నిబంధనలు విధిస్తూ అన్నదాతకు సున్నం పెట్టే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

రైతు భరోసా కోసం రైతులకు షరతులు విధించడమేమిటని ప్రశ్నించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న ప్రభుత్వాన్ని అడుక్కోవాలా? అని ప్రశ్నించారు. ఎలాంటి నిబంధనలు లేకుండా బేషరతుగా రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ప్రజాపాలన దరఖాస్తుల పేరిట ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించిందని గుర్తు చేశారు. ఇంకా ఎన్ని దరఖాస్తులు తీసుకుంటారని నిలదీసింది.

రైతులను వ్యవసాయం చేసుకోనిస్తారా? లేక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుతారా? అని మండిపడ్డారు. కేసీఆర్ రైతాంగాన్ని కడుపులో పెట్టుకొని కాపాడుకున్నారని, కానీ ఈ కాంగ్రెస్ నాయకులు రైతాంగాన్ని కుదేలు చేస్తున్నారన్నారు. షరతులు, నిబంధనలు పెట్టి పెట్టుబడి సాయంగా ఇచ్చే రైతు భరోసాను ఎగవేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని గాలికి వదిలేసిందన్నారు.

కమిటీల పేరుతో కాలయాపన: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

కౌలు రైతులు, రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రైతు భరోసా రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తామని చెప్పారని, కానీ ఇప్పటి వరకు ఇచ్చింది లేదన్నారు. రైతు కూలీలకు ఆర్థిక భరోసా దక్కకుండా ఎవరు అడ్డుకుంటున్నారని నిలదీశారు. బడ్జెట్‌లో కేటాయింపులు చేసి కూడా ఇవ్వలేదన్నారు. రైతు భరోసాపై సబ్ కమిటీ వేసి ఐదు నెలలు గడిచినా ఇప్పటి వరకు విధివిధానాలు ఖరారు చేయలేదని విమర్శించారు.

  • Loading...

More Telugu News