Telugudesam: టీడీపీకి చెందిన 7 కుటుంబాలను వెలివేసిన గ్రామ పెద్దలు
- కాకినాడ జిల్లా ఉప్పుమిల్లి గ్రామంలో దారుణ ఘటన
- టీడీపీ కుటుంబాలపై వైసీపీకి చెందిన గ్రామ పెద్దల బహిష్కరణ
- వారికి గ్రామస్తులెవరూ సహకరించకూడదని ఆదేశం
కాలం మారుతున్నా కొందరి మనస్తత్వాలు మాత్రం మారడం లేదు. పాత పోకడలను కొనసాగిస్తూ పంతాలకు పోతున్నారు. కక్షలతో సాటి మనుషుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఉప్పుమిల్లి గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఏడు కుటుంబాలను గ్రామ పెద్దలు వెలివేశారు. గ్రామ బహిష్కరణ విధించారు. గ్రామస్తులెవరూ వారికి సహకరించకూడదని, శుభకార్యాలకు, పనులకు పిలవకూడదని ఆదేశించారు. గ్రామ బహిష్కరణకు గురైన కుటుంబాలన్నీ టీడీపీకి చెందినవే కావడం గమనార్హం.
వివరాల్లోకి వెళ్తే... ధాన్యం పాట సొమ్ముల విషయంతో పాటు... రాజకీయ పార్టీలకు మద్దతును ప్రకటించే విషయంలో కూడా వివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన ఏడు కుటుంబాలను వెలివేస్తూ గ్రామ పెద్దలు తీర్మానించారని బాధిత కుటుంబాలు వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెలివేసిన గ్రామ పెద్దలు వైసీపీకి చెందినవారని బాధితులు తెలిపారు. వెలిపై కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో బాధితుడు మేడిశెట్టి దుర్గారావు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కాజులూరు తహసీల్దార్, గొల్లపాలెం ఎస్ఐలు గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చారు. గ్రామ పెద్దలు, వెలి బాధితులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇరు వర్గాల మధ్య రాజీ చేసే దిశగా రెవెన్యూ, పోలీసు అధికారులు చర్చలు జరిపారు.