BLN Reddy: ఫార్ములా ఈ-కార్ రేసు.. ఈడీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి డుమ్మా
- ఫార్ములా ఈ-కార్ రేసుపై ఏసీబీ, ఈడీ దర్యాప్తు
- ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ గా చేసిన బీఎల్ఎన్ రెడ్డి
- విచారణకు హాజరు కావడానికి సమయం కావాలని కోరిన బీఎల్ఎన్ రెడ్డి
తెలంగాణ రాజకీయాలు ఫార్ములా ఈ-కార్ రేసు చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ ఏ1గా ఉన్నారు. ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ గా పని చేసిన బీఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. ఈ కేసును ఓవైపు ఏసీబీ, మరోవైపు ఈడీ విచారిస్తున్నాయి. కేటీఆర్ క్వాష్ పిటిషన్ ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు పరిధిలో ఉంది. కేటీఆర్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది. తాము తీర్పును వెలువరించేంత వరకు కేటీఆర్ పై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని, అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది.
మరోవైపు విచారణకు హాజరుకావాలంటూ బీఎల్ఎన్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే నేటి ఈడీ విచారణకు ఆయన డుమ్మా కొట్టారు. విచారణకు హాజరు కావడానికి తనకు మరింత సమయం కావాలని కోరుతూ కేసును దర్యాప్తు చేస్తున్న జాయింట్ డైరెక్టర్ కు మెయిల్ పంపారు.