CMR College: బాత్రూంలో వీడియోలు తీస్తున్నారని అమ్మాయిల ఆరోపణ... సీఎంఆర్ కాలేజీలో పోలీసుల దర్యాఫ్తు
- వీడియోలు తీస్తున్నారంటూ అర్ధరాత్రి వరకు విద్యార్థినుల ఆందోళన
- విద్యార్థినుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
- ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
తెలంగాణలోని మేడ్చల్ జిల్లా కండ్లకోయ సీఎంఆర్ ఐటీ మహిళా హాస్టల్‌లో బాత్రూంలోని దృశ్యాలను చిత్రీకరించారంటూ విద్యార్థినులు నిన్న ధర్నాకు దిగారు. దీంతో స్థానిక ఏసీపీ, సీఐ ఈరోజు హాస్టల్‌కు చేరుకున్నారు. విద్యార్థినుల ఆరోపణల నేపథ్యంలో దర్యాఫ్తు చేస్తున్నారు. కాలేజీలో సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.
అర్ధరాత్రి వరకు ఆందోళన
బాత్రూంలో ఉన్నప్పుడు వీడియోలు తీస్తున్నారని అమ్మాయిలు ఆరోపిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత... గురువారం తెల్లవారుజాము 2 గంటల వరకు విద్యార్థినులతో కలిసి విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. ఈ ఘటనపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని వారికి పోలీసులు హామీ ఇచ్చారు. దీంతో వారు తమ ఆందోళనను విరమించారు.
ఈ ఘటనపై విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. దీంతో మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థినుల బాత్రూం పక్కనే వంట గది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాత్రూంల పక్కనే పనివాళ్ల గది ఉండటం అనుమానాలకు తావిస్తోందని పోలీసులు చెబుతున్నారు.