KP Vivekananda: రేవంత్ రెడ్డి... కేసీఆర్ మార్గంలో నడవక తప్పదు: కేపీ వివేకానంద
- మెట్రో మార్గాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనతో వెల్లడైందన్న వివేకానంద
- మేడ్చల్, శామీర్‌పేట వరకు మెట్రో పొడిగింపు ప్రజల విజయమని వ్యాఖ్య
- రాయదుర్గం-శంషాబాద్ మార్గం పనులను తిరిగి ప్రారంభించాలని డిమాండ్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ మార్గంలో నడవక తప్పదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. మేడ్చల్, శామీర్‌పేట వరకు మెట్రో మార్గాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనతో అది మరోసారి తేలిందన్నారు. కేవలం ఒక మెట్రో విషయంలోనే కాదని... అన్నింటా కేసీఆర్‌ను అనుసరించక తప్పదన్నారు.
తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... హైదరాబాద్ నార్త్ సిటీ వైపు మెట్రో మార్గం పొడిగింపు ప్రజల విజయమన్నారు. మెట్రో పొడిగింపు నిర్ణయం సంతోషమేనని, కానీ ఎప్పుడు దీనిని పూర్తి చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ఎలివేటెడ్ కారిడార్ కోసం ఇప్పటి వరకు తట్టెడు మట్టి తీయలేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాయదుర్గం-శంషాబాద్ మెట్రో రైలు పనులను రద్దు చేశారని ఆరోపించారు. ఆ పనులను తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పనులు రద్దు చేసినప్పుడే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని అడిగామన్నారు. సైంటిఫిక్‌గా స్టడీ చేసి పనులు ప్రారంభించిన మెట్రో మార్గాన్ని రద్దు చేయడం సరికాదన్నారు.