Shubman Gill: శుభ్ మన్ గిల్‌, సాయి సుదర్శన్‌లకు సీఐడీ సమన్లు!

Shubman Gill and Sai Sudharsan Among Gujarat Titans Players Set to be Summoned By CID

  • గుజ‌రాత్‌తో పాటు దేశ‌వ్యాప్తంగా పోంజీ స్కామ్ సంచ‌ల‌నం
  • అధిక వ‌డ్డీ ఆశ‌చూపి ప్ర‌జ‌ల వ‌ద్ద నుంచి రూ.6వేల కోట్లు సేక‌రించిన‌ బీజెడ్ గ్రూప్
  • ఇప్ప‌టికే సీఐడీ అదుపులోకి బీజెడ్ గ్రూప్ అధినేత భూపేంద్ర సింగ్ ఝ‌లా
  • బీజెడ్ గ్రూపులో గుజ‌రాత్ టైటాన్స్ ఆట‌గాళ్లు పెట్టుబ‌డి పెట్టిన వైనం
  • గిల్‌, సాయి సుద‌ర్శ‌న్‌, మోహిత్ శ‌ర్మ‌, రాహుల్ తేవాటియా త‌దిత‌రుల ఇన్వెస్ట్‌మెంట్‌

రూ. 6వేల కోట్ల‌ పోంజీ స్కామ్ గుజ‌రాత్‌తో పాటు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడీ కుంభ‌కోణం సెగ‌ క్రికెట‌ర్ల‌ను తాకింది. అధిక వ‌డ్డీ ఆశ‌చూపి ప్ర‌జ‌ల వ‌ద్ద నుంచి రూ.6వేల కోట్లు జ‌మ చేసిన బీజెడ్ గ్రూప్ అధినేత భూపేంద్ర సింగ్ ఝ‌లాను ఇప్ప‌టికే సీఐడీ అదుపులోకి తీసుకుంది. 

కాగా, బీజెడ్ గ్రూపులో ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజ‌రాత్ టైటాన్స్ ఆట‌గాళ్లు పెట్టుబ‌డి పెట్టిన‌ట్లు తెలుస్తోంది. గుజ‌రాత్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్‌, సాయి సుద‌ర్శ‌న్‌, మోహిత్ శ‌ర్మ‌, రాహుల్ తేవాటియా త‌దిత‌రులు ఇందులో పెట్టుబ‌డి పెట్టార‌ట‌. బీజెడ్ గ్రూపున‌కు చెందిన రూ.450 కోట్లకు సంబంధించిన‌ లావాదేవీలపై ప్ర‌స్తుతం సీఐడీ విచార‌ణ జ‌రుపుతోంది.  

ఇందులో భాగంగా జీటీ క్రికెట‌ర్ల‌కు స‌మ‌న్లు జారీ చేయ‌నుంద‌ని తెలుస్తోంది. వారి నుంచి వివ‌రాలు సేక‌రించిన త‌ర్వాత త‌దుపరి చ‌ర్య‌లు తీసుకోనుంద‌ని స‌మాచారం. ఇక గిల్ బీజెడ్ గ్రూపులో రూ. 1.95 కోట్లు పెట్టుబ‌డి పెట్టిన‌ట్లు అహ్మ‌దాబాద్ మిర్ర‌ర్ నివేదిక వెల్ల‌డించింది. అలాగే ఇత‌ర క్రికెట‌ర్లు కూడా త‌క్కువ మొత్తాల్లో ఇన్వెస్ట్ చేసిన‌ట్లు తెలిపింది. 

కాగా, శుభ్‌మ‌న్ గిల్ ప్ర‌స్తుతం జ‌రుగుతున్న బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీ (బీజీటీ) సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్న విష‌యం తెలిసిందే. ఈ సిరీస్ ముగించుకుని స్వ‌దేశానికి వ‌చ్చిన త‌ర్వాత అత‌నికి సమ‌న్లు జారీ చేసి.. విచారించే అవ‌కాశం ఉంది.      

  • Loading...

More Telugu News