Anurag Kashyap: హిందీ ప్రేక్షకులు దక్షిణాది సినిమాలకు బ్రహ్మరథం పట్టడానికి కారణం ఇదే: బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కష్యప్
- కోర్ ఆడియెన్స్ ను బాలీవుడ్ పట్టించుకోవడం లేదన్న అనురాగ్ కష్యప్
- ప్రేక్షకులకు దగ్గరయ్యే కథలతో దక్షిణాది సినిమాలు వస్తున్నాయని వ్యాఖ్య
- ప్రేక్షకులను పట్టించుకోకపోతే ఇలాంటి పరిస్థితులే వస్తాయన్న అనురాగ్ కష్యప్
బాలీవుడ్ ఇండస్ట్రీపై స్టార్ డైరెక్టర్ అనురాగ్ కష్యప్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్ ఆడియెన్స్ ను పట్టించుకోవడాన్ని బాలీవుడ్ ఎప్పుడో మానేసిందని ఆయన విమర్శించారు. దక్షిణాది ఫిల్మ్ మేకర్స్ ప్రేక్షకులకు దగ్గరయ్యే కథాంశాలతో సినిమాలను నిర్మిస్తున్నారని కితాబిచ్చారు. అందుకే సౌత్ సినిమాలకు హిందీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. ప్రేక్షకుల విషయంలో ఇలా వ్యవహరిస్తే ఇలాంటి పరిస్థితులే వస్తాయని అన్నారు. మన ప్రేక్షకులకు ఏం కావాలో దాన్ని విస్మరించడం కరెక్ట్ కాదని చెప్పారు.
మనం హిందీ సినిమాలు చేస్తున్నామే కానీ, హిందీ ఆడియెన్స్ ను పట్టించుకోవడం లేదని అనురాగ్ కష్యప్ అన్నారు. దీన్ని అనువుగా చేసుకున్న కొంతమంది... యూట్యూబ్ ఛానల్స్ ని ప్రారంభించి... దక్షిణాది చిత్రాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి... హిందీలోకి డబ్ చేసి హిందీ ఆడియెన్స్ కు అందిస్తున్నారని చెప్పారు. డబ్ చేసిన దక్షిణాది సినిమాలపై హిందీ ఆడియెన్స్ ఆసక్తిని చూపుతున్నారని... దక్షిణాది సినిమాలను చూసే ప్రేక్షకుల సంఖ్య కూడా భారీగా పెరిగిందని తెలిపారు. నార్త్ లో దక్షిణాది సినిమాలకు క్రేజ్ పెరగడం వల్లే పాట్నాలో 'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారని చెప్పారు.
బాలీవుడ్ కేవలం లాభాల గురించే ఆలోచిస్తుందని కష్యప్ విమర్శించారు. సినిమా చిత్రీకరణ ప్రారంభానికి ముందు నుంచే ఈ సినిమాను ఎలా మార్కెట్ చేయాలనే ఆలోచనలో బాలీవుడ్ ఉంటుందని... సినిమాను నిర్మించే ఆనందాన్ని కూడా బాలీవుడ్ కోల్పోతోందని చెప్పారు. వచ్చే ఏడాది తాను ముంబై నుంచి బయటకు వెళ్లిపోతానని అన్నారు. 'పుష్ప' వంటి సినిమాలను బాలీవుడ్ మేకర్స్ చేయలేరని... ఎందుకంటే వారికి మెదడు లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
దగ్గుబాటి రానా తండ్రి సురేశ్ బాబు ఎన్నో గొప్ప సినిమాలను నిర్మించారని, ఎంతో మంది ఫిల్మ్ మేకర్స్ కు స్ఫూర్తిగా నిలిచారని... అలాంటి వ్యక్తి చెప్పే మాటలను బాలీవుడ్ ఎందుకు వినడం లేదని అనురాగ్ ప్రశ్నించారు. బాలీవుడ్ ప్రముఖులు అహంభావం, అహంకారంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.