Borugadda: బోరుగడ్డకు షాకిచ్చిన హైకోర్టు.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

Borugadda Anil Anticipatory Bail Petition Rejected

  • అసభ్యకరమైన పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా.. అంటూ సీరియస్
  • ఇలాంటి వారిని క్షమించడానికి వీల్లేదని తేల్చిచెప్పిన జడ్జి
  • సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంపై అనంతపురంలో బోరుగడ్డపై కేసు

వైసీపీ నేత, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారంపై అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు బోరుగడ్డ అనిల్ కుమార్ పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలంటూ బోరుగడ్డ అనిల్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై గురువారం హైకోర్టులో విచారణ జరగగా.. బోరుగడ్డకు నేరచరిత్ర ఉందని, రౌడీ షీట్ కూడా ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు.

రెండు కేసుల్లో ఇప్పటికే అతడిపై చార్జిషీట్ దాఖలైందని చెప్పారు. దీంతో హైకోర్టు జడ్జి తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా అంటూ నిందితుడి తరఫు లాయర్ ను ప్రశ్నించారు. ఇలాంటి వారిని క్షమించడానికి వీల్లేదని, ముందస్తు బెయిల్ ఇవ్వలేమని జడ్జి వ్యాఖ్యానించారు. బోరుగడ్డ పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు.

గత ప్రభుత్వ హయాంలో బోరుగడ్డ ఐదేళ్లపాటు అరాచకంగా ప్రవర్తించాడని పోలీసులు ఆరోపించారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన రాందాస్ అథవాలె అనుచరుడినని చెప్పుకుంటూ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిగా చలామణి అయ్యాడన్నారు. మాజీ సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలతో అంటకాగుతూ నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ చీఫ్ చంద్రబాబు, ఇతర నేతలపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టాడని వివరించారు.

More Telugu News