Bangladesh: భారత్ తో సంబంధాలపై బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ ఏమన్నారంటే..!
- భారత్ తమకు ప్రధానమైన పొరుగు దేశమన్న బంగ్లా ఆర్మీ చీఫ్
- ఎన్నో రకాలుగా ఇండియాపై బంగ్లాదేశ్ ఆధారపడి ఉందని వ్యాఖ్య
- భారత్ ప్రయోజనాలకు విరుద్ధంగా బంగ్లాదేశ్ వ్యవహరించదని స్పష్టీకరణ
భారత్, బంగ్లాదేశ్ ల మధ్య సంబంధాలు నానాటికీ దిగజారుతున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయన తర్వాత పరిస్థితి నానాటికీ దారుణంగా తయారవుతోంది. ఇటీవలి కాలంలో పాకిస్థాన్ తో బంగ్లాదేశ్ సంబంధాలను పెంచుకుంటోంది. జరుగుతున్న పరిణామాలు భారత్ కు ఆందోళనకరంగా మారుతున్నాయి.
ఈ నేపథ్యంలో భారత్ తో సంబంధాలపై బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకీర్ ఉజ్ జమాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ కు ఇండియా అత్యంత ముఖ్యమైన పొరుగు దేశమని ఆయన అన్నారు. ఎన్నో రకాలుగా ఇండియాపై బంగ్లాదేశ్ ఆధాపడి ఉందని చెప్పారు. రెండు దేశాల మధ్య ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఈ సంబంధాలు న్యాయం, సమానత్వంపై ఆధారపడి ఉన్నాయని చెప్పారు. ఈ సూత్రాల ఆధారంగానే భారత్ తో బంగ్లాదేశ్ సంబంధాలను కొనసాగిస్తుందని తెలిపారు.
భారత్ కూడా బంగ్లాదేశ్ నుంచి పలు సౌకర్యాలను పొందుతోందని వకీర్ అన్నారు. పెద్ద సంఖ్యలో భారత్ ప్రజలు బంగ్లాదేశ్ లో అధికారికంగా, అనధికారికంగా పని చేస్తున్నారని చెప్పారు. మెరుగైన వైద్యం కోసం బంగ్లాదేశ్ ప్రజలు భారత్ కు వెళుతుంటారని చెప్పారు. భారత్ కు చెందిన అనేక వస్తువులను తాము కొనుగోలు చేస్తుంటామని తెలిపారు.
భారత్ వ్యూహాత్మక ప్రయోజనాలకు విరుద్ధంగా బంగ్లాదేశ్ వ్యవహరించదని చెప్పారు. బంగ్లాదేశ్ ప్రయోజనాలకు అనుకూలంగానే భారత్ వ్యవహరించాలని అన్నారు. శాంతియుత ఎన్నికల కోసం బంగ్లాదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు బంగ్లాదేశ్ ఆర్మీ సహకరిస్తుందని తెలిపారు.