Vizag: కిక్కిరిసిపోతున్న వైజాగ్ జైల్
- సామర్థ్యం 950 మంది.. ఉన్నదేమో 2,076 మంది
- శిక్ష పడిన ఖైదీల సంఖ్య 440 మాత్రమే
- మిగతా వారంతా రిమాండ్ ఖైదీలేనని అధికారుల వెల్లడి
విశాఖపట్నం జైలు ఖైదీలతో కిక్కిరిసిపోతోంది.. 950 మంది ఖైదీలను ఉంచగల సామర్థ్యం మాత్రమే ఉండగా ప్రస్తుతం 2,076 మంది ఖైదీలు ఉన్నారని అధికారులు తెలిపారు. జైలు సామర్థ్యానికి మించి ఖైదీలను ఉంచడంతో పర్యవేక్షణ, వసతుల కల్పన సవాలుగా మారిందని చెబుతున్నారు. ఇప్పుడు ఉన్న ఖైదీలలో శిక్ష ఖరారైన వారి సంఖ్య 440 మాత్రమేనని, మిగతా వారంతా రిమాండ్ ఖైదీలేనని తెలిపారు.
ఖైదీల సంఖ్య ఎక్కువగా ఉండడంతో గదులు సరిపోవడంలేదని, ఇరుకు గదిలో ఇబ్బంది పడుతున్నానంటూ ఓ ఖైదీ తన బంధువులకు చెప్పాడు. దీంతో ఖైదీ బంధువులు ఇటీవల జైలు ఎదుట ఆందోళన చేశారని సమాచారం. ఈ క్రమంలోనే 200 మంది ఖైదీలను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జైలులో మొత్తం 16 బ్యారక్ లు..
రాష్ట్రంలో గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపడం, తనిఖీలు పెంచడంతో పెద్ద సంఖ్యలో నిందితులు పట్టుబడుతున్నారు. వారిని కోర్టు ఆదేశాలతో విశాఖ సెంట్రల్ జైలుకు అధికారులు తరలిస్తున్నారు. అయితే, జైలులో మొత్తం 16 బ్యారక్ లు ఉండగా.. అందులో 950 మంది ఖైదీలను ఉంచే వీలుంది. ప్రస్తుతం ఈ జైలులో 2,076 మంది ఖైదీలు ఉన్నారు.
ఇందులో 1,145 మంది గంజాయి కేసుల్లో పట్టుబడి రిమాండ్ ఖైదీలుగా వచ్చిన వారేనని అధికారులు తెలిపారు. మిగతా వారిలో 440 మంది ఖైదీలకు శిక్ష ఖరారైందని చెప్పారు. మరోవైపు, క్షమాభిక్ష కింద విడుదలయ్యే అవకాశం ఉన్న ఖైదీలు 40 మందికి పైనే ఉన్నారు కానీ మూడేళ్లుగా క్షమాభిక్ష జాబితాను ప్రకటించలేదని సమాచారం.
సిబ్బంది 90 మందే..
జైలు నిబంధనల ప్రకారం 150 మంది సిబ్బంది ఉండాల్సింది కానీ ప్రస్తుతం 90 మంది మాత్రమే ఉన్నారని అధికారులు తెలిపారు. దీంతో సిబ్బంది కొరత వేధిస్తోందని డీఐజీ రవికిరణ్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. మరో 30 మంది సిబ్బందిని కేటాయించాలని కోరినట్లు తెలిపారు. సిబ్బంది తక్కువగా ఉండడం వల్ల పూర్తిస్థాయిలో ఖైదీల పర్యవేక్షణ సవాలుగా మారిందన్నారు.
విశాఖ జైలులో మరో భవన నిర్మాణానికి రూ.26 కోట్లు విడుదల చేయడానికి కేంద్ర హోంశాఖ అంగీకరించింది. అదేవిధంగా ఓపెన్ జైలు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో మరో 250 మంది ఖైదీలను ఉంచేందుకు ఏర్పాట్లు చేయవచ్చని అధికారులు తెలిపారు. భద్రతా ఏర్పాట్ల కోసం ఏపీ ప్రభుత్వం మరో రూ.75 లక్షలు కేటాయించినట్లు వివరించారు.