Smoking Habit: మహిళలు ఒక్క సిగరెట్ తాగితే జరిగేది ఇదే.. తాజా అధ్యయనంలో నివ్వెరపరిచే నిజాలు!
- ఒక్క సిగరెట్ స్త్రీల ఆయుర్దాయాన్ని సగటున 22 నిమిషాలు తగ్గిస్తుందన్న యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్ అధ్యయనం
- పురుషుల ఆయుష్షు సగటున 17 నిమిషాలు తగ్గుతుందని హెచ్చరిక
- సిగరెట్ అలవాటు మానుకోకుంటే జీవితంలో దశాబ్దకాలం కోల్పోతారని ధూమపాన ప్రియులకు వార్నింగ్
ధూమపానం ప్రాణాంతకమని ప్రభుత్వాలు, వైద్యరంగ నిపుణులు ఎంత హెచ్చరించినా కొందరు వ్యక్తులు ఆ అలవాటును మానుకోవడం లేదు. అలాంటివారిని అప్రమత్తం చేసే మరో అధ్యయనం వెలువడింది. ఒక్క సిగరెట్ పురుషుల ఆయుష్షును సగటున 17 నిమిషాలు, స్త్రీల ఆయుర్దాయాన్ని సగటున 22 నిమిషాలు తగ్గుతుందని యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు తేల్చారు. ఈ మేరకు ‘జర్నల్ ఆఫ్ అడిక్షన్’లో తాజా అధ్యయనం ప్రచురితమైంది.
రోజుకు 10 సిగరెట్లు తాగే అలవాటు ఉన్న వ్యక్తి 2025 జనవరి 1న ధూమపానం అలవాటును మానేస్తే జనవరి 8 నాటికి ఒక పూర్తి రోజు జీవితాన్ని పొందవచ్చని అధ్యయనం సూచించింది. ఫిబ్రవరి 5 నాటికి ఆయుర్దాయం ఒక వారం రోజులు, ఆగస్టు 5 నాటికి ఒక నెల పెరుగుతుందని పేర్కొంది. ఏడాదిపాటు ధూమపానానికి దూరమైతే 50 రోజుల జీవితకాల నష్టాన్ని తగ్గించుకోవచ్చని లెక్కగట్టింది.
ధూమపానం హానికరమనే విషయం సాధారణ ప్రజలు అందరికీ తెలుసని, అయితే హానిని తక్కువగా అంచనా వేస్తున్నారని ఆల్కహాల్ అండ్ టొబాకో రీసెర్చ్ గ్రూప్‌లో సభ్యుడిగా ఉన్న ప్రిన్సిపల్ రీసెర్చ్ ఫెలో డాక్టర్ సారా జాక్సన్ అన్నారు. ధూమపానం మానేయని వారు సగటున ఒక దశాబ్దకాలం జీవితాన్ని కోల్పోతారని ‘ది గార్డియన్’తో చెప్పారు.
ధూమపాన ప్రియులు తమ జీవితంలో విలువైన సమయాన్ని కోల్పోతున్నామనే విషయాన్ని గుర్తించలేరని, వృద్ధాప్య సమస్యలే ఇందుకు కారణమని అన్నారు. 70 ఏళ్లు బతికే అవకాశం ఉన్న వ్యక్తులు పదేళ్ల జీవితకాలాన్ని కోల్పోతారని జాక్సన్ వివరించారు. ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు పూర్తిగా అలవాటును వదిలేయాలని సూచించారు. ధూమపానం గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి పరిస్థితులకు దారితీస్తుందని, ఈ పరిస్థితుల ప్రమాదాన్ని దాదాపు 50 శాతం మేర పెరుగుతాయని పేర్కొంది.