BCCI: కోచింగ్ సహాయక సిబ్బందిపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తి!.. టీమిండియాలో మరింత సంక్షోభం?
- సహాయక సిబ్బందిలోని ఓ వ్యక్తిపై గుర్రుగా ఉన్న బీసీసీఐ పెద్దలు
- అన్ని వేదికల వద్ద తన వ్యక్తిగత సహాయకుడితో కనిపిస్తున్నాడంటూ మండిపాటు
- మైదానాల్లో బీసీసీఐ పెద్దలకు కేటాయించిన బాక్సుల్లోనూ కనిపిస్తుండడంపై అసహనం
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో స్థాయికి తగిన ప్రదర్శన చేయలేక తీవ్ర విమర్శల పాలవుతున్న టీమిండియాలో సమస్యలు మరింత ఎక్కువవుతున్నాయి. భారత జట్టు కోచింగ్ సహాయక సిబ్బందిలో ఒకరి ప్రవర్తన పట్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. సహాయక సిబ్బందిలోని ఒక సభ్యుడు అన్ని వేదికల వద్ద తన వ్యక్తిగత సహాయకుడితో కలిసి కనిపిస్తున్నాడని బీసీసీఐ వర్గాలు మండిపడుతున్నాయి. ప్రస్తుత సిరీస్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియాలో మ్యాచ్‌లు జరుగుతున్న మైదానాల్లో బీసీసీఐ సభ్యులకు కేటాయిస్తున్న బాక్స్‌ల్లో సదరు వ్యక్తి కనిపిస్తున్నాడంటూ బోర్డు ఉన్నతవర్గాలు చెప్పినట్టు పీటీఐ పేర్కొంది.
సదరు వ్యక్తి ఐపీఎల్ సమయంలో ‘ఫీల్డ్ ఆఫ్ ప్లే’ (మ్యాచ్ ఆడే పిచ్) యాక్సెస్‌ను కలిగి ఉండేవాడని, మ్యాచ్‌లు ముగిసిన వెంటనే ఫ్రాంచైజీ జెర్సీతో పిచ్‌మీదకు వెళ్లేవాడని పేర్కొంది. ఇదిలావుంచితే, భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లకు కోచ్ గౌతమ్ గంభీర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టుగా ఇటీవల కథనాలు గుప్పుమన్నాయి. మ్యాచ్ పరిస్థితులను పట్టించుకోకుండా, ‘సహజ సిద్ధమైన ఆట’ పేరిట కొందరు ఆటగాళ్లు వారికి తోచిన విధంగా ఆడుతున్నారంటూ మండిపడినట్టు తెలిసింది. మెల్‌బోర్న్ టెస్టులో 184 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైన తర్వాత ఈ మేరకు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఈ వ్యవహారంపై భారత మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, డబ్ల్యూవీ రామన్ విమర్శలు గుప్పించారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరిగినా బయటకు రాకూడదని అన్నారు. ఇలాంటి పరిస్థితులు జట్టులో సంక్షోభానికి దారితీస్తాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు 1-2తో వెనుకబడి ఉండడంతో ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది పనితీరుని బీసీసీఐ పెద్దలు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన సిరీస్‌లో వరుసగా విఫలమవుతుండడంపై బీసీసీఐ గుర్రుగా ఉందని పీటీఐ పేర్కొంది.