: సల్మాన్ ఖాన్ అభ్యర్థనపై కోర్టు నిర్ణయం 24కు వాయిదా
హత్యాయత్నం కేసు కింద తనను విచారించాలంటూ గతంలో కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సల్మాన్ ఖాన్ దాఖలు చేసుకున్న పిటిషన్ పై ముంబై సెషన్స్ కోర్టు తీర్పును ఈ నెల 24కు వాయిదా వేసింది. భారీ వర్షాల కారణంగా ముంబై స్తంభించిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 2002నాటి కారు యాక్సిడెంట్ కేసులో సల్మాన్ భవితవ్యాన్ని కోర్టు ఆ రోజున నిర్ణయించనుంది. 2002 అక్టోబర్ 4న రాత్రి తాగిన మత్తులో సల్మాన్ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి, పుట్ పాత్ పై పడుకున్న వారిపైకి ఎక్కించడంతో ఒకరు మరణించగా, నలుగురు గాయపడ్డారు. అయితే, నిర్లక్ష్యం వల్లే నాడు ఆ ప్రమాదం జరిగిందంటూ సల్మాన్ శిక్ష తగ్గించుకునేందుకు ప్రయత్నం చేశారు. దీనికైతే గరిష్ఠంగా రెండేళ్ల జైలు శిక్ష పడుతుంది. అదే హత్యాయత్నం కింద నేరం నిరూపితమైతే సల్మాన్ 10ఏళ్లు జైలుకెళ్లాల్సి వస్తుంది. అందుకే లోగడ కోర్టు ఇచ్చిన తీర్పును సల్మాన్ సవాలు చేశారు.