Delhi Raiway Station: రైల్వే స్టేషన్‌లో ఉచిత వీల్‌చైర్ సర్వీసుకు ఎన్నారై నుంచి రూ. 10 వేల వసూలు!

NRI charged Rs 10000 for Free wheelchair Services at Delhi Railway station

  • కుమార్తె ఫిర్యాదుతో వెలుగులోకి విషయం
  • పోర్టర్‌ను గుర్తించి చర్యలు తీసుకున్న రైల్వేస్
  • రూ. 9 వేలు వెనక్కి తీసుకుని ప్రయాణికుడికి అందజేత
  • పోర్టర్ లైసెన్స్ రద్దు చేసి బ్యాడ్జ్‌ను వెనక్కి తీసుకున్న అధికారులు
  • ఇలాంటి ఘటనలు సహించబోమని స్పష్టీకరణ

ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో ఎన్నారైకు వీల్‌చైర్ సేవలు అందించినందుకు రూ. 10 వేలు వసూలు చేసిన ఘటనను రైల్వే తీవ్రంగా పరిగణించింది. దీనిపై విచారణకు ఆదేశించడంతోపాటు పోర్టర్ లైసెన్స్‌ను రద్దు చేసింది. ప్రయాణికుడి నుంచి వసూలు చేసిన డబ్బుల్లో 90 శాతం వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. 

ఇలాంటి ఘటనలను సహించబోమని నార్తరన్ రైల్వేస్ స్పష్టం చేసింది. పోర్టర్ నుంచి బ్యాడ్జ్‌ను ఢిల్లీ డివిజన్ వెనక్కి తీసుకున్నట్టు పేర్కొంది. ప్రయాణికుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని తేల్చి చెప్పింది. రైల్వే స్టేషన్లలో వీల్ చైర్ సేవలు ఉచితంగా లభిస్తాయి. కానీ, డిసెంబర్ 28న ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తన తండ్రి నుంచి ఏకంగా రూ. 10 వేలు వసూలు చేశారంటూ ఎన్‌ఆర్ఐ ప్రయాణికుడి కుమార్తె పాయల్ రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. 

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోర్టర్‌ను గుర్తించిన అధికారులు అతడి నుంచి రూ.9 వేలు వెనక్కి తీసుకుని ప్రయాణికుడికి అందించారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డివిజనల్ రైల్వే మేనేజర్ మాట్లాడుతూ ప్రయాణికుల సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణానికి రైల్వే కట్టుబడి ఉందని తెలిపారు. ఇలాంటి ఘటనలు రైల్వే ప్రతిష్ఠను దిగజారుస్తాయని, ప్రయాణికుల నమ్మకాన్ని వమ్ముచేస్తాయని చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి సమస్యలు ఏవైనా ఎదురైతే 139 ద్వారా తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. 

  • Loading...

More Telugu News