Vinod Kambli: తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కాంబ్లీ.. ఇప్పుడు సొంత ఇంటిని కోల్పోయే ప్రమాదం!
- ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి తాజాగా కోలుకున్న మాజీ క్రికెటర్
- గత కొంతకాలంగా కాంబ్లీకి అనారోగ్యంతో పాటు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు
- ఐఫోన్ రిపేర్‌కు అయిన రూ.15వేలు చెల్లించలేదని కాంబ్లీ మొబైల్ తీసుకెళ్లిన దుకాణదారుడు
- అప్పటి నుంచి ఫోన్ లేకుండానే ఉంటున్న వైనం
- నిర్వహణ ఖర్చులు రూ. 18 లక్షలు చెల్లించాల్సిందిగా హౌసింగ్ సొసైటీ ఒత్తిడి
- లేనిపక్షంలో ఇంటిని కూడా కోల్పోయే ప్రమాదం ఉందన్న కాంబ్లీ భార్య ఆండ్రియా
భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ ఇటీవల అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరి కోలుకున్నాడు. తాజాగా డిశ్చార్జ్ అయ్యాడు. బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆయన ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన వీడియో నెట్టింట వైరల్ అయింది. అయితే, గత కొంతకాలంగా కాంబ్లీ అనారోగ్యంతో పాటు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడనే విషయం తెలిసిందే.
కొన్ని నివేదికల ప్రకారం, అతను గత ఆరు నెలలుగా ఫోన్ లేకుండానే ఉన్నాడు. కాంబ్లీకి ఐఫోన్ ఉండేదని, కానీ ఆ మొబైల్ రిపేర్ ఫీజు రూ. 15,000 చెల్లించకపోవడంతో దుకాణదారుడు దానిని తీసుకెళ్లాడని న్యూస్18 కథనం పేర్కొంది. అతని ఆరోగ్యం మెరుగుపడినప్పటికీ, అతను ప్రస్తుతం ఆర్థికంగా కష్టపడుతున్నట్లు నివేదిక పేర్కొంది.
ఇక కాంబ్లీకి బీసీసీఐ నుంచి నెలవారీ రూ. 30,000 పెన్షన్ వస్తోంది. అలాగే ఇటీవల ఒక రాజకీయ పార్టీ అతనికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం చేసింది. అయితే, కాంబ్లీ భార్య ఆండ్రియా హెవిట్ మాట్లాడుతూ, ప్రస్తుతం తమ హౌసింగ్ సొసైటీ నిర్వహణ ఖర్చులు రూ. 18 లక్షలు చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఒకవేళ ఆ రుసుము చెల్లించని పక్షంలో తాము తమ ఇంటిని కోల్పోయే అవకాశం ఉందన్నారు.
ఇక కాంబ్లీ వైద్యం కోసం మాజీ క్రికెటర్లు అతనికి సహాయం చేశారు. దాదాపు రెండు వారాల పాటు చికిత్స పొందిన అతడు బుధవారం థానే జిల్లా భివాండిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. ఆ సమయంలో కాంబ్లీ అక్కడ వేచి ఉన్న మీడియాతో మాట్లాడాడు.
మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. ఈ రెండూ జీవితాన్ని నాశనం చేస్తాయని పేర్కొన్నాడు. కాగా, కాంబ్లీ ఇప్పుడు పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని అతనికి చికిత్స చేసిన డాక్టర్ వివేక్ త్రివేది తెలిపారు.