Crime News: పంజాగుట్టలో అదృశ్యమైన వ్యాపారి అనుమానాస్పద మృతి
- 29న రాత్రి పది గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యాపారి
- ఆ తర్వాత నుంచి సెల్‌ఫోన్ స్విచ్చాఫ్..
- సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఎల్లారెడ్డిగూడలోని బుద్ధనగర్ ప్రాంతంలో ఉన్నట్టు గుర్తింపు
- రమేశ్ అనే యువకుడితో కలిసి గదిలోకి వెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజీ
- అదే గదిలో శవమై కనిపించిన విష్ణురూపాని.. పరారీలో రమేశ్
పంజాగుట్టలో ఐదు రోజుల క్రితం అదృశ్యమైన వ్యాపారి ఎల్లారెడ్డిగూడలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డిగూడకు చెందిన విష్ణురూపాని (45) గోపి అండ్ సన్స్ పేరిట కిరాణ దుకాణం నిర్వహిస్తున్నాడు. గత నెల 29న రాత్రి పదిన్నర గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన 12 గంటల కల్లా తిరిగి వస్తానని చెప్పాడు. అయితే, ఆ తర్వాత ఆయన ఫోన్ స్విచ్చాఫ్ కావడం, రెండ్రోజులైనా ఆచూకీ లేకపోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విష్ణురూపాని ఎల్లారెడ్డిగూడలోని బుద్ధనగర్ ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించారు. అక్కడి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు రమేశ్ అనే యువకుడితో కలిసి విష్ణు సమీపంలోని గదిలోకి వెళ్లినట్టు గుర్తించారు. నిన్న అక్కడకు వెళ్లారు. గది నుంచి దుర్వాసన రావడాన్ని గమనించి తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ విష్ణురూపాని మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. ఆయనతోపాటు గదిలోకి వెళ్లిన రమేశ్ ఆచూకీ కనిపించకపోవడంతో అతడిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విష్ణు హత్యకు గురైనట్టు భావిస్తున్నా, మృతదేహం కుళ్లిపోయి ఉండటంతో శరీరంపై గాయాలు కనిపించడం లేదని పోలీసులు చెబుతున్నారు.
విష్ణు హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని అనుమానిస్తున్నారు. అనుమానితుడు రమేశ్ గతంలో విష్ణు వద్ద పనిచేసేవాడు. ఆ సమయంలో విష్ణు వద్ద తన వాహనాన్ని కుదువ పెట్టి కొంత అప్పు తీసుకున్నాడు. డబ్బులు చెల్లించి వాహనం తీసుకెళ్లాలని విష్ణు పలుమార్లు రమేశ్‌కు సూచించాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్టు తెలుస్తోంది. విష్ణు ముఖంపై దిండు ఉండటంతో నిందితుడు దానితో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. రమేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.