Gated Community: గేటెడ్ కమ్యూనిటీల్లో అసాంఘిక కార్యకలాపాలు.. అడ్డుకట్టకు తెలంగాణ హైకోర్టు ఆదేశం
- ఇందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్ విల్లాల కమ్యూనిటీలో యథేచ్ఛగా పేకాట, మద్యం, మత్తు పదార్థాల వినియోగం
- పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించిన హరిగోవింద్ ఖొరానారెడ్డి
- మార్గదర్శకాలు రూపొందించి గేటెడ్ కమ్యూనిటీలు, ఫ్లాట్ ఓనర్ల అసోసియేషన్‌కు ఇవ్వాలని పోలీస్ కమిషనర్‌కు సూచన
- మద్యం వినియోగం, సరఫరా విషయంలో ఎక్సైజ్ శాఖ అనుమతి తప్పనిసరి
గేటెడ్ కమ్యూనిటీ జీవన శైలి పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఏం చేయాలి? ఏం చేయకూడన్న దానిపై సలహాలు, మార్గదర్శకాలు రూపొందించి గేటెడ్ కమ్యూనిటీ, ఫ్లాట్ ఓనర్ల అసోసియేషన్‌కు జారీ చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. వీటితోపాటు పాటించాల్సిన చట్ట నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వులను కూడా అందించాలని ఆదేశించింది.
గేటెడ్ కమ్యూనిటీల్లో అసాంఘిక కార్యకలాపాలు
హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని ఇందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్ విల్లాల కమ్యూనిటీలో పేకాట, మద్యం, మత్తు పదార్థాల వినియోగం, లైంగిక చర్యలు పెరుగుతున్నాయని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ అక్కడి నివాసి సీహెచ్ హరిగోవింద ఖొరానారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ కోసం వెళ్లిన పోలీసులు అక్కడ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగడం లేదని చెబుతున్నారని, పోలీసుల రాకపై కమ్యూనిటీ సెక్యూరిటీ సిబ్బంది ముందస్తు సమాచారం ఇస్తుండటంతో ఆధారాలు మాయం చేస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు. అయితే, ఆ తర్వాత ఇందూ క్లబ్‌లో పోలీసులు 15 మందిని అదుపులోకి తీసుకోవడంపై స్పందించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. విజయసేన్‌రెడ్డి.. ఇక్కడి కమ్యూనిటీలో ఏమీ జరగలేదని చెప్పడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఇదొక్కటే కాకుండా నగరంలోని గేటెడ్ కమ్యూనిటీల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఆదేశాలు జారీ చేశారు.
రోజువారీ నియంత్రణ కష్టమే
గేటెడ్ కమ్యూనిటీల్లో జరిగే అసాంఘిక, చట్ట విరుద్ధ కార్యకలాపాల నియంత్రణకు చర్యలు చేపట్టే అధికారం సిటీ పోలీసు చట్టం కింద పోలీసులకు ఉందని స్పష్టం చేశారు. 376 విల్లాలు ఉన్న ఇందూ ఫార్చ్యూన్ వంటి కమ్యూనిటీలో రోజువారీ కార్యక్రమాలను నియంత్రించడం అసోసియేషన్‌కు కష్టమేనని, కాబట్టి తగు నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించి గేటెడ్ కమ్యూనిటీ అసోసియేషన్లకు పంపాలని ఆదేశించారు. అలాగే, ఇందూ ఫార్చ్యూన్‌లో ఎగ్జిక్యూటివ్ కమిటీలో లేనివారితో ముగ్గురు సభ్యుల సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని ఓనర్స్ అసోసియేషన్‌ను ఆదేశించారు.
గేటెడ్ కమ్యూనిటీల్లోని క్లబ్ హౌస్‌లలో మద్యం వినియోగం, సరఫరాకు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ అనుమతి తప్పనిసరని పేర్కొన్నారు. అలాగే, లౌడ్ స్పీకర్ రూల్స్, శబ్ద కాలుష్యం, ప్రొహిబిషన్ యాక్ట్, చట్ట విరుద్ధ కార్యకలాపాల నియంత్రణకు ఇతర సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా గేటెడ్ కమ్యూనిటీలు, అసోసియేషన్లు, ఫ్లాట్ యాజమానులకు అవసరమైన సలహాలు జారీ చేయాలని ఎస్‌వోటీ పోలీసులను ఆదేశించారు.
ప్రశాంత జీవనం కోసమే గేటెడ్ కమ్యూనిటీలు
మెరుగైన సౌకర్యాలతో గౌరవప్రదంగా, ప్రశాంతగా గడపవచ్చన్న కారణంతో ఎక్కువమంది గేటెడ్ కమ్యూనిటీలను ఎంచుకుంటున్నారని హైకోర్టు అభిప్రాయపడింది. ఇవన్నీ తెలంగాణ అపార్ట్‌మెంట్ చట్టం నిబంధనల కింద నడుస్తున్నాయని, అలాంటి వాటిలో అంతర్గత విభేదాలు, అక్రమ కార్యకలాపాలను నియంత్రించే వారు లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేసింది.
శక్తిమంతులను ఎదుర్కోవడం కష్టమే
అక్కడ నివసించే వారిలో ఎక్కువమంది ధనిక వర్గానికి చెందినవారే కావడంతో అధికారులు, పోలీసులపై వారి ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. కాబట్టి ఇలాంటి ప్రాంతాల్లో శక్తిమంతమైన మెజారిటీ సభ్యులను ఒంటరిగా ఎదుర్కోవడం కష్టేమనని, కాబట్టి గేటెడ్ కమ్యూనిటీల అంతర్గత నిర్వహణకు ప్రభుత్వం నిర్దిష్ట మార్గదర్శకలను రూపొందించేందుకు సరైన సమయం ఇదేనని హైకోర్టు అభిప్రాయపడింది.