sanjay gupta: టాలీవుడ్ యువ నిర్మాత నాగవంశీపై బాలీవుడ్ ఫిలింమేకర్ ఆగ్రహం
- బోనీకపూర్‌తో నాగవంశీ మాట్లాడిన తీరును తప్పుబట్టిన సంజయ్ గుప్తా
- విజయం అందుకోవడం మాత్రమే కాదు, గౌరవం ఇవ్వడం కూడా నేర్చుకోవాలని హితవు
- తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్స్‌తోనూ నాగవంశీ ఇలాగే ప్రవర్తిస్తారా? అంటూ నిలదీత
టాలీవుడ్ యువ నిర్మాత నాగవంశీపై బాలీవుడ్ దర్శక నిర్మాత సంజయ్ గుప్తా ఫైర్ అయ్యారు. హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో నిర్మాతగా పేరొందిన బోనీకపూర్‌తో నాగవంశీ మాట్లాడిన తీరును సంజయ్ గుప్తా ఆక్షేపించారు. నాలుగు హిట్స్ అందుకున్నంత మాత్రాన అతను (నాగవంశీ) బాలీవుడ్‌కు రాజు కాలేడని, టాలీవుడ్‌కు చెందిన సీనియర్ నిర్మాతలు అల్లు అరవింద్, సురేశ్ బాబు వంటి వారితోనూ ఇదే విధంగా మాట్లాడగలడా? అని ప్రశ్నించారు. విజయం అందుకోవడం మాత్రమే కాదు, గౌరవం ఇవ్వడం కూడా నేర్చుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అగ్ర నిర్మాతతో నాగవంశీ ఆ విధంగా మాట్లాడటం సరికాదని అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్స్‌తోనూ ఇలాగే ప్రవర్తిస్తారా? అని నిలదీశారు. బోనీకపూర్ లాంటి సీనియర్ నిర్మాత పక్కన కూర్చొని తన వ్యాఖ్యలతో ఆయన్ను ఎగతాళి చేసిన ఈ వ్యక్తి ఎవరు.. అతడి వైఖరి ఏమీ బాగాలేదని సంజయ్ గుప్తా అన్నారు. సంజయ్ గుప్తా మాత్రమే కాకుండా మరి కొందరు బాలీవుడ్ దర్శక, నిర్మాతలు కూడా నాగవంశీ వ్యాఖ్యలను ఆక్షేపించారు. ఈ క్రమంలో సంజయ్ గుప్తా సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టుకు మద్దతు తెలుపుతున్నారు.
విషయంలోకి వెళితే.. 2024 ఏడాది ముగింపును పురస్కరించుకుని ఓ వెబ్ సైట్ ఇటీవల దక్షిణాదితో పాటు బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శక నిర్మాతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో నాగవంశీ, బోనీకపూర్ మధ్య సంవాదం జరిగింది. హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ ముంబయికే పరిమితం అయిందని నాగవంశీ చేసిన వ్యాఖ్యలను బోనీకపూర్ తప్పుబట్టారు. అమితాబ్ బచ్చన్ కు తాను పెద్ద అభిమానినని అల్లు అర్జున్ చెప్పిన విషయాన్ని బోనీకపూర్ గుర్తు చేయగా.. షారుక్ ఖాన్, చిరంజీవికీ అల్లు అర్జున్ పెద్ద అభిమాని అని నాగవంశీ కౌంటర్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో బాలీవుడ్ దర్శక నిర్మాత సంజయ్ గుప్తా స్పందిస్తూ నాగవంశీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.