Team India: ఆస్ట్రేలియా ప్రధాని నివాసంలో న్యూ ఇయర్ పార్టీ... హాజరైన టీమిండియా ఆటగాళ్లు
- బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్
- ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న టీమిండియా
- న్యూ ఇయర్ పార్టీ ఇచ్చిన ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్
- హాజరైన ఇరు జట్ల ఆటగాళ్లు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న టీమిండియా ఆటగాళ్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ నివాసంలో ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ పార్టీకి హాజరయ్యారు. ఈ పార్టీకి టీమిండియా ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ విందు కార్యక్రమం దాదాపు గంటన్నర పాటు సాగింది.
ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో ముచ్చటించడం కనిపించింది. ఈ సందర్భంగా అల్బనీస్ ఎంతో సరదా వ్యాఖ్యలు చేశారు. "బుమ్రా... నువ్వు బౌలింగ్ కు వస్తున్నావంటే ఎంతో ఎగ్జయిటింగ్ గా అనిపిస్తుంది. అందుకే ఓ చట్టం చేయాలనుకుంటున్నాం... నువ్వు ఎడమ చేత్తోనే బౌలింగ్ చేయాలి, లేదా, ఒక అడుగు కూడా వేయకుండా బౌలింగ్ చేయాలి" అంటూ చమత్కరించారు.
ప్రధాని అల్బనీస్ నివాసంలో జరిగిన ఈ న్యూ ఇయర్ వేడుకలో ఆసీస్ ఆటగాళ్లు కూడా పాల్గొన్నారు. ఆసీస్ యువ ఆటగాడు సామ్ కొన్ స్టాస్ తన ఆరాధ్య ఆటగాడు విరాట్ కోహ్లీతో ఓ ఫొటో కూడా దిగినట్టు తెలుస్తోంది. మెల్బోర్న్ టెస్టుతో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన కొన్ స్టాస్... దూకుడుగా ఆడి అలరించాడు. అయితే, కోహ్లీ ఉద్దేశపూర్వకంగా కొన్ స్టాస్ ను ఢీకొట్టి జరిమానాకు గురయ్యాడు.
ఆస్ట్రేలియా ప్రధాని ఇచ్చిన పార్టీకి కొన్ స్టాస్ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. వారు టీమిండియా స్టార్ పేసర్ బుమ్రాతో ఫొటో దిగారు.
కాగా, ఈ సిరీస్ లో చివరి టెస్టు జనవరి 3న సిడ్నీలో ప్రారంభం కానుంది. ఈ ఐదు టెస్టుల సిరీస్ లో ప్యాట్ కమిన్స్ నాయకత్వంలో ఆసీస్ 2-1తో ఆధిక్యంలో ఉంది.