Fasal: 2025లో కేంద్ర కేబినెట్ తొలి సమావేశం... రైతుల కోసం కీలక నిర్ణయాలు!

Cabinet approves continuation of Fasal Bima Yojana

  • 2025 తొలి కేబినెట్ భేటీని ప్రధాని మోదీ రైతులకు అంకితం చేశారన్న కేంద్రమంత్రి
  • ఫసల్ బీమా యోజనకు కేటాయింపులను రూ.69 వేల కోట్లకు పెంచుతూ కేబినెట్ ఆమోదం
  • డీఏపీ ఎరువుల బస్తాను రూ.1,350కే రైతుకు అందించే పథకం పొడిగింపుకు ఆమోదం

కేంద్ర కేబినెట్ బుధవారం నాడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2025లో తొలి కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ప్రధాని నరేంద్రమోదీ రైతులకు అంకితం చేశారని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రైతుల సంక్షేమం గురించి ప్రధానంగా ఈ కేబినెట్ సమావేశంలో చర్చ జరిగిందన్నారు.

పంటల బీమా పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను మరింతగా మెరుగుపరచాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. ఫసల్ బీమా యోజనకు కేటాయింపులను రూ.69,515 కోట్లకు పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. అలాగే 50 కిలోల డీఏపీ ఎరువుల బస్తాను రూ.1,350 చొప్పున రైతులకు అందించేందుకు రూ.3,850 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని పొడిగిస్తున్నట్లు కేంద్రమంత్రి వివరించారు.

కేంద్ర కేబినెట్ నిర్ణయాలపై ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రైతుల సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామన్నారు. దేశానికి అన్నం పెట్టేందుకు శ్రమించే రైతన్నను చూసి గర్విస్తున్నామని పేర్కొన్నారు. 2025లో జరిగిన తొలి కేబినెట్ సమావేశాన్ని రైతుల శ్రేయస్సు కోసమే అంకితం చేశామని తెలిపారు. రైతుల విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

  • Loading...

More Telugu News