Jinping: కొత్త సంవత్సరం సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సంచలన వ్యాఖ్యలు
- తైవాన్ ను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్న చైనా
- తైవాన్ ను చైనాలో కలుపుకోవడాన్ని ఎవరూ ఆపలేరన్న జిన్ పింగ్
- మాతృభూమిని ఏకం చేయడాన్ని ఎవరూ అడ్డుకోలేరని వ్యాఖ్య
నూతన సంవత్సర వేడుకల వేళ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చేసిన ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. చైనా, తైవాన్ రెండూ వేర్వేరు కాదని ఆయన అన్నారు. తైవాన్ ను చైనాలో కలుపుకోవడాన్ని ఎవరూ ఆపలేరని చెప్పారు.
తైవాన్ జలసంధికి ఇరువైపులా (చైనా, తైవాన్) ఉన్న చైనా ప్రజలంతా ఒకే కుటుంబమని జిన్ పింగ్ అన్నారు. మన రక్త సంబంధాలను ఎవరూ తెంచలేరని చెప్పారు. మన మాతృభూమిని ఏకం చేయడాన్ని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. అందుకే తైవాన్ చుట్టూ వైమానిక, నౌకాదళ విన్యాసాలు చేపట్టామని స్పష్టం చేశారు.
ఇప్పటికే చైనా, తైవాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తైవాన్ ను బలప్రయోగం ద్వారా ఆక్రమించుకోవడానికి చైనా ప్రయత్నాలు చేస్తోంది. గత మే నెలలో లాయ్ చింగ్ తైవాన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత... ఆ దేశ ప్రాదేశిక జలాల్లో చైనా ఇప్పటి వరకు మూడు సార్లు భారీ మిలిటరీ విన్యాసాలను చేపట్టింది. వాస్తవానికి చైనా, తైవాన్ రెండు దేశాలు పరస్పర విరుద్ధమైన జీవన విధానాలను కలిగి ఉంటాయి. చైనా కమ్యూనిస్టు దేశం కాగా... తైవాన్ ప్రజాస్వామ్య దేశం.