Sanjay Raut: సంజయ్ రౌత్ పై కార్యకర్తల దాడి?
- ఉద్ధవ్ థాక్రే నివాసంలోనే ఘటన
- రౌత్ ను గదిలో బంధించిన కార్యకర్తలు!
- వార్తలపై స్పందించని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్
మహారాష్ట్రలో శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ పై దాడి జరిగిందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మాజీ సీఎం, పార్టీ అధినేత ఉద్ధవ్ థాక్రే నివాసం మాతోశ్రీలోనే ఈ ఘటన చోటుచేసుకుందని సమాచారం. పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో తీవ్ర వాగ్వాదం జరిగిందని, ఆగ్రహం పట్టలేక కొంతమంది కార్యకర్తలు రౌత్ పై చేయిచేసుకున్నారని కథనాలు వెలువడుతున్నాయి.
అయితే, దీనిపై అటు సంజయ్ రౌత్ కానీ ఇటు ఉద్ధవ్ థాక్రే కానీ స్పందించలేదు. ఒకటి రెండు రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకుందని, సంజయ్ రౌత్ ను కార్యకర్తలు గంటల తరబడి ఓ గదిలో బంధించారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ కథనాలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. మహారాష్ట్ర నేతల్లో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.
త్వరలో జరగనున్న బీఎంసీ ఎన్నికల సన్నద్ధపై ఇటీవల మాతోశ్రీలో సమావేశం జరిగింది. పార్టీ చీఫ్ ఉద్ధవ్, సీనియర్ నేత సంజయ్ రౌత్ తో పాటు పలువురు కార్యకర్తలు ఈ మీటింగ్ కు హాజరయ్యారు. సమావేశంలో సంజయ్ రౌత్ పై కార్యకర్తలు విమర్శలు చేశారని, ఆయన వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని ఆరోపించారని తెలిసింది. దీంతో ఆగ్రహం చెందిన సంజయ్ రౌత్.. కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారని, కార్యకర్తలు రౌత్ పై దాడి చేశారని సమాచారం. ఆపై సంజయ్ రౌత్ ను ఓ రూంలో గంటల తరబడి బంధించారని తెలుస్తోంది.