Uppal Stadium: న్యూ ఇయర్ వేడుకల తర్వాత చెత్తకుప్పలా మారిన ఉప్పల్ మున్సిపల్ స్టేడియం.. వీడియో ఇదిగో!
- మార్నింగ్ వాక్ కోసం వచ్చిన స్థానికులు షాక్
- ఎక్కడ చూసినా మద్యం సీసాలు, డిస్పోజబుల్ గ్లాసులే
- పార్టీ నిర్వాహకులు, పర్మిషన్ ఇచ్చిన అధికారులపై స్థానికుల ఆగ్రహం
న్యూ ఇయర్ వేడుకల కోసం పర్మిషన్ ఇస్తే స్టేడియం మొత్తాన్నీ కంపు కంపు చేసిన ఘటన ఉప్పల్ లో చోటుచేసుకుంది. స్థానిక మున్సిపల్ స్టేడియం బుధవారం ఉదయం చెత్తకుప్పలా కనిపించింది. ఎక్కడ చూసినా మద్యం సీసాలు, ఖాళీ బాటిళ్లు, డిస్పోజబుల్ గ్లాసులతో పాటు తిని పడేసిన మాంసం ముక్కలే కనిపించాయి.
రోజూలాగే ఉదయం వాకింగ్ కు వచ్చిన స్థానికులు ఇది చూసి అవాక్కయ్యారు. స్టేడియంలో న్యూ ఇయర్ పార్టీ నిర్వహించిన వారితో పాటు, ఈ వేడుకలకు అనుమతిచ్చిన అధికారులపైనా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీ పూర్తయిన తర్వాత అదంతా శుభ్రం చేయించాల్సిన నిర్వాహకులు... అదేమీ పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీంతో స్టేడియం మొత్తం గందరగోళంగా మారిపోయింది. ఇదంతా తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేసి, అధికారులు, పార్టీ నిర్వాహకుల తీరును ఎండగడుతున్నారు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్తా వైరల్ గా మారాయి.