Gautam Gambhir: మెల్‌బోర్న్ టెస్టు ఓటమి తర్వాత.. టీమిండియా కీలక ఆటగాళ్లకు గౌతం గంభీర్ వార్నింగ్!
- బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా పేలవమైన ప్రదర్శన
- నాలుగో టెస్టు తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లపై గౌతీ అసహనం
- భారత జట్టు ఆటగాళ్లను గంభీర్ హెచ్చరించినట్లు 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' కథనం
- ఇకపై తన ప్రణాళిక ప్రకారమే ప్లేయర్లు ఆడాలని హెడ్ కోచ్ హుకుం
ఈసారి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా పేలవమైన ప్రదర్శనతో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో విజయంతో సిరీస్‌ను ప్రారంభించిన భారత జట్టు ఆ తర్వాత ఒక టెస్టును డ్రాగా ముగించి మరో రెండు టెస్టుల్లో ఓటమి పాలైంది. దీంతో ఆతిథ్య ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంలో ఉంది. ఇక బీజీటీ సిరీస్‌లో టీమిండియా ప్రదర్శన నేపథ్యంలో ప్రధాన కోచ్ గౌతం గంభీర్‌పై ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం.
దీంతో ప్రస్తుతం భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం అంత బాగా లేదని తెలుస్తోంది. గౌతీ ఆధ్వర్యంలో శ్రీలంకపై వన్డే సిరీస్, న్యూజిలాండ్‌పై స్వదేశంలో టెస్టు సిరీస్ కోల్పోయింది. ఇప్పుడు ఆస్ట్రేలియాలో మరో సిరీస్ కోల్పోయి ప్రమాదంలో టీమిండియా ఉంది. అలాగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశం కూడా సన్నగిల్లింది.
ఇక మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన 4వ టెస్ట్‌లో కొంతమంది స్టార్ ప్లేయర్లు తమ ఇష్టానికి ఆడి, వికెట్‌ను పారేసుకోవడం పట్ల గంభీర్ అసహనం వ్యక్తం చేశాడట. మెల్‌బోర్న్‌లో ఓడిపోయిన తర్వాత ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కి తిరిగి వచ్చిన వెంటనే "బహుత్ హో గయా (ఇక చాలు)" అని కోచ్ గౌతీ భారత జట్టు ప్లేయర్లపై కోపంగా అరిచినట్లు 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పేర్కొంది.
కొంతమంది ఆటగాళ్లు మైదానంలో ప్రవర్తించిన తీరుపై భారత ప్రధాన కోచ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. గంభీర్ ఆటగాళ్లకు వారి శైలిలో ఆడేందుకు 6 నెలల సమయం ఇచ్చానని చెప్పాడని, అయితే ఇప్పుడు అదంతా ఆగిపోయిందని చెబుతున్నారు. ఇక నుంచి జట్టు కోసం తాను వేసుకున్న ప్రణాళికల ప్రకారం ఆడని వారికి ఎగ్జిట్ డోర్ చూపించనున్నారని తెలుస్తోంది.
మెల్‌బోర్న్ టెస్ట్‌లో రిషబ్ పంత్ నిర్లక్ష్యపూరిత షాట్ ఆడి ఔట్ కావడం.. విరాట్ కోహ్లీ కూడా స్టంప్ అవతల వెళుతున్న డెలివరీని ఛేజింగ్ చేసి మరీ స్లిప్‌లో ఉన్న ఫీల్డర్ చేతికి క్యాచ్ ఇవ్వడం వంటి వాటిపై గౌతీ అసహనం వ్యక్తం చేశాడట. అటు కెప్టెన్ రోహిత్ శర్మ రెండవ ఇన్నింగ్స్‌ను జాగ్రత్తగా ప్రారంభించిన తర్వాత మళ్లీ తన బలహీనతను బయటపెట్టి ఔటయ్యాడు. ఇలా భారత ఆటగాళ్లు చేస్తున్న ఇలాంటి చర్యలు గంభీర్‌ని బాధించాయని, దాంతో ప్రధాన కోచ్ ఇప్పుడు తీవ్రమైన చర్యలకు సిద్ధమయ్యాడని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయా ఆటగాళ్లను గౌతీ వార్న్ చేసినట్లు తెలుస్తోంది.