Game Changer: 'గేమ్ ఛేంజర్' ట్రైలర్‌పై కీలక అప్‌డేట్
- రామ్‌చరణ్, శంకర్ కాంబోలో 'గేమ్ ఛేంజర్'
- జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా
- రేపు సాయంత్రం 5.04 గంటలకు మూవీ ట్రైలర్ విడుదల
- కొత్త సంవత్సరం కానుకగా మేకర్స్ ప్రకటన
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబోలో వస్తున్న భారీ చిత్రం 'గేమ్ ఛేంజర్'. సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మేకర్స్ ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇటీవలే అమెరికాలోని డల్లాస్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అలాగే జనవరి 4న రాజమండ్రిలో గ్రాండ్‌గా మరో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు చిత్రబృందం రెడీ అవుతోంది.
ఇక ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ కు మంచి స్పందన రాగా.. అవి సినిమాపై అంచనాలను పెంచాయి. ఇక ఈ చిత్ర ట్రైలర్ ఎప్పుడు విడుదల అవుతుందా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. కొత్త సంవత్సరం సందర్భంగా మేకర్స్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్ర ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు. రేపు (జనవరి 2న) సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. 'ఆట మొదలైంది' అంటూ చరణ్ పంచె కట్టుతో ఉన్న ఫొటోను చిత్ర బృందం పంచుకుంది.
కాగా, 'గేమ్ ఛేంజర్'లో రామ్ చరణ్ రెండు పవర్‌ఫుల్ పాత్రల్లో కనిపించనున్న విషయం తెలిసిందే. చెర్రీ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్ఎస్ తమన్ స్వరాలు అందిస్తున్న ఈ మూవీని.. శ్రీవెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ మూవీకి కథను అందించారు. ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, అంజలి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.